Telugu Global
National

'నోబెల్ శాంతి బహుమతి పోటీలో ముందున్న మోడీ' అనే వార్త ఫేక్ !

ప్రధాని మోడీని నోబెల్ శాంతి బహుమతి పోటీదారుగా పేర్కొంటూ వైరల్ అయిన ట్వీట్‌పై వివరణ ఇస్తూ టోజే, ఆ ట్వీట్ నకిలీదని అన్నారు.

నోబెల్ శాంతి బహుమతి పోటీలో ముందున్న మోడీ అనే వార్త ఫేక్ !
X

భారత‌ ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతి పోటీ దారుల్లో ముందున్నారంటూ జాతీయ మీడియా, సోషల్ మీడి యా హడావుడి చేసింది. ఈ విషయాన్ని మన దేశంలో పర్యటిస్తున్న నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే స్వయంగా చెప్పినట్టు మీడియా ప్రసారాలు చేసింది. ఆయన పోస్ట్ చేసినట్టుగా ఓ ట్వీట్ ప్రచారంలో పెట్టింది మీడియా.

ఇక మోడీ ఫ్యాన్స్ ఉదయం నుంచి ఈ వార్తనునెట్టింట వైరల్ చేయడంలో మునిగిపోయారు. ఆ వార్త నిజమా కాదా అనే విషయాన్ని కూడా జాతీయ మీడియా సంస్థలు కనీసం చెక్ చేసుకోలేదు.

చివరకు అదంతా ఫేక్ అని తేలిపోయింది. నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే స్వయంగా ఆ న్యూస్ ఫేక్ అని తేల్చారు.

నోబెల్ శాంతి బహుమతికి పోటీదారుగా ప్రధాని మోడి ఉన్నారా ? అని అస్లే టోజే ను ఓ న్యూస్ ఏజెన్సీ అడిగినప్పుడు , "ఏ నాయకుడైనా ఈ అవార్డుకు అర్హులు కావాలంటే ప్రపంచంలో శాంతి కోసం మరింత కృషి చేయాలి." అని అన్నారు.

ప్రధాని మోడీని నోబెల్ శాంతి బహుమతి పోటీదారుగా పేర్కొంటూ వైరల్ అయిన ట్వీట్‌పై వివరణ ఇస్తూ టోజే, ఆ ట్వీట్ నకిలీదని అన్నారు. "నేను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్‌ని. ఒక ఫేక్ న్యూస్ ట్వీట్ ను ఎవరో కావాలనే వదిలారు. అదంతా ఫేక్ న్యూస్‌. దాని గురించి ఎక్కువగా చర్చించవద్దు. దానిపై చర్చ చేసి ఫేక్ న్యూస్ కు మరింత ఆజ్యం పోయొద్దు. ఆ న్యూస్ ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను." అని తేల్చేశారు.

అస్లే టోజే మాట్లాడిన ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన ఫ్యాక్ట్ చెకర్, జర్నలిస్ట్ మహ్మద్ జుబేద్ ఆ ఇంటర్వ్యూ చేసిన న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఈ వీడియోను ఎందుకు ట్వీట్ చేయలేదు అని ప్రశ్నించారు.

అయితే ఆశ్చ‌ర్యకరమైన విషయమేంటంటే ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి పోటీ దారుల్లో మోడీ ముందున్నాడంటూ ప్రచారం చేసిన జాతీయ మీడీయా ఆ వార్త ఫేక్ అనే విషయాన్ని మాత్రం ప్రసారం చేయలేదు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజనులు ఫైర్ అవుతున్నారు. మీడియాపై ప్రజలు నమ్మకం కోల్పోయేట్టు వారే చేసుకుంటున్నారని పలువురు నెటిజనులు విమర్శలు గుప్పించారు.

First Published:  16 March 2023 4:17 PM GMT
Next Story