Telugu Global
National

మోడీ ఫ్యాన్స్ 'వాట్సప్' ప్రచారాలు చివరకు ఆయనకే చిక్కులు తెచ్చి పెడుతున్నాయా ?

మోడీ ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో చేసిన‌ ప్రచారాలు ఆయనకే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రెల్ లో జరిగిన ఒక ప్రచారం, తాజాగా జరిగిన మరో ప్రచారాన్ని మోడీ సర్కారే స్వయంగా ఖండించాల్సి వచ్చింది.

మోడీ ఫ్యాన్స్ వాట్సప్ ప్రచారాలు చివరకు ఆయనకే చిక్కులు తెచ్చి పెడుతున్నాయా ?
X

మోడీ సర్కార్ గొప్ప కార్యక్రమాలు చేస్తోందని, ప్రజలకు అండగా ఉంటోందని ప్రచారం చేసేందుకు 'వాట్సప్ యూనివర్సిటీ స్కాలర్లు' తెగ తాపత్రయపడుతుంటారు. ఒక్కో సారి తమ నాయకుణ్ణి పొగిడే తొందరలో వారు తమ నాయకుడికే చిక్కులు తెచ్చిపెడుతుంటారు. చివరకు ఆ ప్రచారాన్ని ప్రభుత్వమే ఖండించాల్సిన పరిస్థితి వస్తోంది.

ఈ విధమైన ప్రచారాలు, ప్రభుత్వ ఖండనలు ఈ మధ్య కాలంలో బాగానే జరుగుతున్నాయి. తమకు ఇబ్బందులు రానంత వరకు ఎలాంటి ప్రచారాన్నైనా ఆనందంతో స్వీకరించే ప్రభుత్వాలు, తమకు చిక్కులు తెచ్చిపెడతాయనుకుంటే మాత్రం మేలుకుంటున్నాయి.

ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ఈ మధ్య కాలంలో జరిగిన రెండు ప్రచారాలు మంచి ఉదహరణ. ఈ ఏడాది ఏప్రెల్ లో జరిగిన ఒక ప్రచారం కాగా, తాజాగా జరిగిన మరో ప్రచారాన్ని మోడీ సర్కారే స్వయంగా ఖండించాల్సి వచ్చింది.

ప్రధానమంత్రి లాడ్లీ లక్ష్మీ యోజన కింద దేశంలోని ప్రతి ఆడబిడ్డకు కేంద్ర ప్రభుత్వం రూ. 1.6 లక్షలు ఇస్తోందంటూ ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఓ యూట్యూబ్ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి అది నిజమే అనుకున్న చాలా మంది దానికి అప్లై చేయడమెలా అనే దానిపై గూగుల్ సర్చ్ లు కూడా చేశారు. వాళ్ళ స్థానిక నాయకులను అడిగారు. అయితే ప్రజలకు ఎక్కడి నుంచి కూడా జవాబు దొరకలేదు. చివరకు ఈ ప్రచారం మోడీ సర్కార్ మెడకు చుట్టుకుంటుందనే భయంతో ప్రభుత్వం మేల్కొంది. ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది.

"ప్రధాన మంత్రి లాడ్లీ లక్ష్మీ యోజన కింద కుమార్తెలందరికీ రూ. 1,60,000 నగదు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని యూ ట్యూబ్ వీడియోలో క్లెయిమ్ చేస్తున్నారు. అయితే వైరల్ అయిన ఈ యూట్యూబ్ వీడియో ఫేక్''అని పిఐబి పేర్కొంది. "కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదు" అని తెలిపింది.

ఇటువంటి ప్రచారాలను ప్రభుత్వమే ఖండించినప్పటికీ మోడీ ఫ్యాన్స్ మాత్రం ఆగడంలేదు. మళ్ళీ తాజాగా మరో ప్రచారంతో 'సర్కారీ వ్లాగ్' అనే యూట్యూబ్ ఛానెల్ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో కూడా ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యింది. ఆ వీడియో ప్రకారం... ''కేంద్ర ప్రభుత్వం 'కన్యా సుమంగళ యోజన' కింద కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్న వారికి నెలకు రూ.4,500 ఇస్తోంది.'' నిజానికి కేంద్రం అటువంటి పథకం ఏదీ ప్రవేశపెట్టలేదు. అయితే ఈ యూ ట్యూబ్ వీడియో ప్రచారంతో ఆడపిల్లలను కన్న తల్లితండ్రుల్లో ఆశలు కలిగాయి. ఆ పథకాన్ని పొందడం ఎలాగో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. వెంటనే మేల్కొన్న ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో ఈ యూ ట్యూబ్ వీడియో చేస్తున్న ప్రచారం అబద్దమని తేల్చింది.

తమకు లాభం కలిగే అబద్దపు ప్రచారాలను ఆనందంగా స్వీకరించే రాజకీయ నాయకులు, అప్పుడప్పుడు తమ 'వాట్సప్' ప్రచారంతో చిక్కులు తెచ్చిపెట్టే ఫ్యాన్స్ కూడా ఉంటారని తెలుసుకుంటే మంచిది.

First Published:  7 May 2023 4:07 AM GMT
Next Story