Telugu Global
National

పోటీ పరీక్షలు...27 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాల కోసం రాత పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పోటీ పరీక్షలు...27 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
X

అసోంలో ఆదివారం నాడు 27 జిల్లాల్లో నాలుగు గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇంట్లో ఉన్నపుడు కాకుండా బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు హాట్ స్పాట్, 4జి రూటర్ వంటి వైర్‌లెస్ నెట్ వర్కులతో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాల కోసం రాత పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసోంలో ఈ నెలలో ఇలా చేయటం ఇది రెండోసారి.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కాగా ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించింది. దాంతో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటమే కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్న 27 జిల్లాల్లో 144వ సెక్షన్‌ని సైతం విధించారు. 14.30 లక్షల మంది అభ్యర్థులు సుమారు 30 వేల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల తేదీలు ఆగస్టు 21, 28, సెప్టెంబరు 11. గ్రేడ్-4 ఉద్యోగాల కోసం పరీక్షలను ఆగస్టు 21న నిర్వహించగా, ఆగస్టు 28న గ్రేడ్-3 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గ్రేడ్-3 ఉద్యోగాల కోసం సెప్టెంబరు 11న పరీక్షలు నిర్వహించనున్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.

First Published:  28 Aug 2022 2:23 PM GMT
Next Story