Telugu Global
National

కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీయులపై దాడులు.. ఆందోళనలో ఇండియన్స్

మరోవైపు ఇండియా‌, పాకిస్థాన్...కిర్గిజిస్థాన్‌లోని విద్యార్థులను అలర్ట్‌ చేశాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్టూడెంట్స్‌కు రెండు దేశాల కాన్సులెట్‌లు సూచించాయి.

కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీయులపై దాడులు.. ఆందోళనలో ఇండియన్స్
X

కిర్గిజ్‌స్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ రాజధాని బిష్‌కెక్‌‌ అల్లర్లతో అట్టుడుకుతోంది. భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ స్టూడెంట్స్‌ ఉంటున్న హాస్టల్స్‌ టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తెలంగాణ, ఏపీ నుంచి వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‌‌

మరోవైపు ఇండియా‌, పాకిస్థాన్...కిర్గిజిస్థాన్‌లోని విద్యార్థులను అలర్ట్‌ చేశాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్టూడెంట్స్‌కు రెండు దేశాల కాన్సులెట్‌లు సూచించాయి. అల్లర్ల విషయమై కిర్గిజ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాయి. అల్లర్లకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కిర్గిజ్ ప్రభుత్వ సంస్థలు స్పష్టం చేశాయని భారత విదేశాంగ కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రస్తుతం పరిస్థితి భద్రతా బలగాల ఆధీనంలో ఉందని తెలిపింది. ఎంబసీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని ఇండియన్ స్టూడెంట్స్‌కు సూచించారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌.

అల్లర్లకు కారణం ఏంటంటే!

ఓ హాస్టల్‌లో స్థానికులకు..పాకిస్థాన్, ఈజిప్టు విద్యార్థులకు మధ్య ఈ నెల 13న జరిగిన గొడవ ఈ పరిస్థితికి దారి తీసింది. దీంతో స్థానికులు కొంతమంది గుంపులు గుంపులుగా బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థానీలు ఉంటున్న హాస్టల్స్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో మరిన్ని అల్లర్లకు దారి తీసింది.

వైద్య విద్య కోసం కిర్జిజ్‌స్థాన్ ఎందుకంటే.!

కిర్గిజ్‌స్థాన్‌లో వైద్య విద్య చదివేందుకు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో మెడికల్ సీట్ల సంఖ్య తక్కువగా ఉండడం, వైద్య విద్యకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్స్‌ కిర్గిజ్‌స్థాన్, రష్యా, ఉక్రెయిన్ దేశాల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్‌లో దాదాపు 15 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కిర్గిజ్‌స్థాన్‌లోని కాలేజీలకు వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ గుర్తింపు ఉండడం కూడా ఓ కారణం. ఏపీ, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ దేశంలో ఉన్నారు.

First Published:  19 May 2024 4:13 AM GMT
Next Story