Telugu Global
National

స్టేషన్ పేర్లు అమ్మేసిన ముంబై మెట్రో.. రూ.200 కోట్ల ఆదాయం..

ICICI లాంబార్డ్ సిద్ధివినాయక్ మెట్రో స్టేషన్‌, LIC చర్చ్ గేట్, LIC హుటాత్మా చౌక్ అనేవి కొత్త పేర్లు. ఇలా స్టేషన్ పేర్లు అమ్మేసి ఏడాదికి 40 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు ఆర్జిస్తోంది MMRC.

స్టేషన్ పేర్లు అమ్మేసిన ముంబై మెట్రో.. రూ.200 కోట్ల ఆదాయం..
X

అబిడ్స్, అసెంబ్లీ, అమీర్‌పేట్.. ఆటోలో వెళ్లినా, సిటీ బస్‌లో వెళ్లినా, మెట్రో రైల్‌లో వెళ్లినా.. ఆయా స్టాప్ ల పేర్లలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎల్ఐసీ అబిడ్స్, ఐసీఐసీఐ అసెంబ్లీ, మహీంద్రా అమీర్ పేట్. ఈ పేర్లు కాస్త వెరైటీగా ఉన్నాయి కదూ. ఆయా స్టాప్‌ల‌ ముందు కంపెనీల పేర్లు పెడితే ప్రయాణికులెవరూ పెద్దగా కన్ఫ్యూజ్ కారు. కానీ పేరు మార్చినందుకు ఆయా కంపెనీలు రవాణా సంస్థలకు పెద్ద మొత్తంలో సొమ్ము అందిస్తాయి. అందులోనూ మెట్రో రైల్‌లో వెళ్తే ప్రతిసారీ స్టేషన్ వచ్చేముందు కచ్చితంగా కంపెనీ పేర్లు కూడా అనౌన్స్ మెంట్లో వినిపిస్తాయి. అలా ఆ కంపెనీ ప్రయాణికులకు బాగా గుర్తుండిపోతుంది. హైదరాబాద్‌లో ఇలాంటి ప్రయత్నం జరగలేదు కానీ ముంబైలో మాత్రం మెట్రో రైల్ సంస్థ, స్టేషన్ పేర్లను అమ్మకానికి పెట్టి 200 కోట్ల రూపాయలు ఆర్జించింది.

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) కొత్తగా మెట్రో 3 కారిడార్ ప్రారంభించబోతోంది. ఈ కారిడార్‌లో ఉన్న అన్ని స్టేషన్ పేర్లను ఆయా సంస్థల ప్రచారానికి ఉపయోగించుకునేలా చేయడం ద్వారా ఏడాదికి 200 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితికి ఆయా సంస్థలకు బ్రాండింగ్‌కు అవకాశమిచ్చింది MMRC. అత్యథికంగా ఒక స్టేషన్ పేరుని ఏడాదికి 8 కోట్ల రూపాయలకు బేరం పెట్టారట. భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే బ్రాండింగ్ కోసం ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు దక్కిన అత్యధిక‌ ధర ఇదని అంటున్నారు. దుబాయ్, మాడ్రిడ్, జకార్తా, కౌలాలంపూర్‌లో కూడా మెట్రోకు ఈ స్థాయిలో బ్రాండింగ్ అవకాశం రాలేదని తెలుస్తోంది.

మెట్రో రైళ్ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. కేవలం ప్రయాణికుల టికెట్ రేట్లపై ఆధారపడితే అది గిట్టుబాటయ్యే వ్యవహారం కాదు. అందుకే ఇతర వ్యాపారాలపై మెట్రో రైళ్ల సంస్థలు దృష్టి పెడుతుంటాయి. ప్రయాణికులపై భారం మోపకుండా, అదే సమయంలో ప్రయాణికుల ద్వారానే బ్రాండింగ్ పేరుతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముంబై మెట్రో అత్యధికంగా ఆర్జిస్తోంది.

ఇకపై బాంద్రా కుర్లా కాంప్సెక్స్ స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టేషన్‌ల ముందు కొటక్ మహీంద్రా బ్యాంక్ అనే పేరు జత చేరుతుంది. ICICI లాంబార్డ్ సిద్ధివినాయక్ మెట్రో స్టేషన్‌, LIC చర్చ్ గేట్, LIC హుటాత్మా చౌక్ అనేవి కొత్త పేర్లు. ఇలా స్టేషన్ పేర్లు అమ్మేసి ఏడాదికి 40 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు ఆర్జిస్తోంది MMRC.

Next Story