Telugu Global
National

మహిళా రిజర్వేషన్లు సరే.. ఓబీసీల సంగతేంటి..?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని ఆకాంక్షించారు.

మహిళా రిజర్వేషన్లు సరే.. ఓబీసీల సంగతేంటి..?
X

మహిళా రిజర్వేషన్లతోపాటు ఓబీసీ కోటా కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం పోస్ట్‌డేటెడ్‌ చెక్ వంటిదని విమర్శించారామె. మధ్యప్రదేశ్‌లోని దతియాలో ఓబీసీ హక్కుల ఫ్రంట్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘పీడిత్‌ అధికార్‌ యాత్ర’ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత.


ఇది ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం చేస్తున్న ఉద్యమం అని పేర్కొన్నారు కవిత. దేశంలో ఎంతమంది ఓబీసీ న్యాయమూర్తులు ఉన్నారని రాహుల్‌గాంధీ లాంటి వ్యక్తులు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారామె. కాంగ్రెస్ హయాంలో వారు ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని ఆకాంక్షించారు. పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు కవిత. దామాషా ప్రకారం మహిళా రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు.

‘పీడిత్‌ అధికార్‌ యాత్ర’ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కవితకు ఓబీసీ నేతలు ఘన స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా ఓబీసీ హక్కుల పోరాటానికి మద్దతు తెలుపుతున్న నాయకుల్ని వారు సాదరంగా ఆహ్వానించారు. ఓబీసీ హక్కుల సాధనకోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఓబీసీల్లోని మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా కూడా అమలు చేయాలన్నారు.

First Published:  29 Jan 2024 3:57 AM GMT
Next Story