Telugu Global
National

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి.. కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి

విపక్షాలపై కూర్చొని పని చేయాలని కాంగ్రెస్ భావిస్తే.. ఆ పార్టీ ముందుగా అహంకారాన్ని వదిలిపెట్టాలని, వాస్తవాలను గ్రహించాలని, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు కవిత.

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి.. కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి
X

బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వేళ, ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కవిత ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడానికి అందరూ కలసి పోరాడాలన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని, కాంగ్రెస్ తన అహంకారాన్ని వీడాలని సూచించారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే అన్నారని, కానీ దేశంలో అన్ని చోట్లా కాంగ్రెస్ కి బలం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 4 వేలకుపైగా ఎమ్మెల్యే స్థానాలు ఉంటే, అందులో బీజేపీ, కాంగ్రెస్ కి కలిపినా 2వేల ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవన్నారు. మిగతా స్థానాలు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయని, ఆ విషయాన్ని ఆ రెండు పార్టీలు గుర్తించాలన్నారు.

కాంగ్రెస్ పెత్తనం చెల్లదు..

విపక్షాలపై కూర్చొని పని చేయాలని కాంగ్రెస్ భావిస్తే.. ఆ పార్టీ ముందుగా అహంకారాన్ని వదిలిపెట్టాలని, వాస్తవాలను గ్రహించాలని, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు కవిత. మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు. దేశానికి మంచి జరగాలంటే కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రత్యామ్నాయం రావాలని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్, కేరళలో పినరయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశం మారుతుందని 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు అంతా భావించారని, కానీ దేశం ఏం మారిందని ప్రశ్నించారు. కీలకమైన హామీలను అమలే చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, నల్లధానాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకురాలేదని, రూపాయి విలువ పడిపోవడాన్ని కట్టడి చేయలేకపోయారని పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు కవిత. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, పవన్ ఖేరా అరెస్టు దీనికి తాజా నిదర్శనం అని అన్నారామె. కాంగ్రెస్ కలిసి వచ్చినా, రాకున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలకు బలం ఉందని తెలిపారు కవిత.

కాంగ్రెస్ ప్లీనరీ ముందు చత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో ఈడీ దాడులు జరిగాయని, విపక్షాలు సమావేశాలు పెట్టుకున్నా కూడా భయపడుతున్నారంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతోందన్నారు కవిత. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కొంత మందిని కాపాడడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి రహిత ఇమేజ్ మోదీకి ఇప్పుడు లేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ హామీలను ప్రజలు నమ్మారని, కానీ వాటిని అమలు చేయడంలో ప్రధాని విఫలమయ్యారని విమర్శించారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అదే మోడల్ ని దేశం మొత్తం అమలు చేయాలన్న ఉద్దేశంతో.. టీఆర్ఎస్ ని, బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మార్చామని వివరించారు కవిత. దేశానికి మంచి చేయాలని తాము ముందుకొస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 2014కు ముందు ప్రధాని మోదీ చెప్పిన గురజాత్ మోడల్, ఇప్పటి తెలంగాణ మోడల్ మొత్తం వేర్వేరని, గుజరాత్ కంటే తెలంగాణ మోడల్ ఉత్తమమైనదని, ఫలితాలు కళ్లముందు ఉన్నాయని వివరించారు.

First Published:  23 Feb 2023 3:40 PM GMT
Next Story