Telugu Global
National

కవిత దీక్ష ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నేతలు

దీక్ష ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల మహిళా నేతలు కవిత వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెతోపాటు కూర్చుని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు.

కవిత దీక్ష ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నేతలు
X

కవిత దీక్ష ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నేతలు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ దీక్షకు భారీగా మహిళా నేతలు తరలి వచ్చారు.


సాయంత్రం 4 వరకు కవిత ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభోత్సవానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మహిళా మంత్రులు, ఇతర పార్టీల నేతలు కవితకు సంఘీభావం తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సీపీఐ నేత డి.రాజా.. ఈ దీక్ష విరమింపజేస్తారు.

కవితతోపాటు దీక్షా వేదిక వద్ద 500మంది మహిళా నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. దీక్ష ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల మహిళా నేతలు కవిత వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెతోపాటు కూర్చుని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు మహిళా నేతలు.

బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, మహిళా బిల్లు ఆమోదంపై చిత్తశుద్ధి ఉంటే.. పార్లమెంట్‌ లో మహిళా బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కవిత. బీజేపీకి పార్లమెంట్‌ లో పూర్తి మెజార్టీ ఉందన్న ఆమె, మహిళా బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


తమ బాధ్యత మేరకు ఒత్తిడి తెస్తున్నామని, బీజేపీకి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉభయ సభల్లో మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లుని ఎందుకు ఆమోదించడంలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు మహిళా నేతలు. ఇంకెన్నాళ్లు మహిళలను మోసం చేస్తారని మండిపడ్డారు.

First Published:  10 March 2023 5:27 AM GMT
Next Story