Telugu Global
National

బిల్కిస్ బానో రేపిస్టులను 'స‍ంస్కారీలు' అని మెచ్చుకున్న నేత‌కు బీజేపీ టికట్

బిల్కిస్ బానో ను రేప్ చేసి, ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులను చంపిన 11 మంది దోషులను విడిపించడానికి చంద్రసిన్హ్ రౌల్జీ తీవ్ర ప్రయత్నం చేశారు.ఆ తర్వాత ఆయన రేపిస్టులను మెచ్చుకుంటూ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

బిల్కిస్ బానో రేపిస్టులను స‍ంస్కారీలు అని మెచ్చుకున్న నేత‌కు బీజేపీ టికట్
X

బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల కోసం నిర్ణయం తీసుకున్న కమిటీలో ముఖ్య సభ్యుడు, రేపిస్టులను 'స‍ంస్కారీ బ్రాహ్మణుల'ని మెచ్చుకున్న చంద్రసిన్హ్ రౌల్జీ కి ఈ సారి బీజేపీ టిక్కట్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం గోద్రా నియోజకవర్గం నుంచి ఆయనకు ఈ సారి కూడా బీజేపీ టికట్ కేటాయింది. ఆ నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బిల్కిస్ బానో ను రేప్ చేసి, ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులను చంపిన 11 మంది దోషులను విడిపించడానికి చంద్రసిన్హ్ రౌల్జీ తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నానికి తోడు, రాష్ట్ర, కే‍ంద్ర ప్రభుత్వాలు కూడా రేపిస్టుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారంతా ఆగస్టు 15న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ రేపిస్టులపై ప్రశంసలు కురించారు. వారు సంస్కారవంతమైన బ్రాహ్మణులు, అటువంటి వారు రేపులు చేయరు. అని సర్టిఫికెట్ ఇచ్చేశారు.

ఆ11 మంది రేపిస్టులు విడుదలయినప్పుడు అనేక హిందూ గ్రూపులు వారికి సన్మానాలు చేశాయి. వారి గ్రామంలో వారి బంధువులు స్వీట్లు పంచి, బాణాసంచా పేల్చి ఉత్సవం చేసుకున్నారు. మరో వైపు వీరు విడుదల కాగానే ఆ గ్రామంలో మిగిలి ఉన్న ముస్లిం కుటుంబాలు భయంతో గ్రామం విడిచి పారి పోయాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చంద్రసిన్హ్ రౌల్జీ ఆ రేపిస్టులను మెచ్చుకుంటూ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

"వారు బ్రాహ్మణులు.బ్రాహ్మణులు మంచి సంస్కారం కలిగి ఉంటారు. వారిని కార్నర్ చేసి శిక్షించాలనేది కొందరి దురుద్దేశం" అని రౌల్జీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా విమర్శలకు కారణమయ్యింది.

ఆయన వ్యాఖ్యలను పలు విపక్షాలు ఖండించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఈ క్లిప్‌ను షేర్ చేసి... రేపిస్టులను 'సంస్కారవంతమైన పురుషులు'గా పేర్కొనడం ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం. ఆ పార్టీ స్థాయి ఎంత దిగజారిపోయిందో ఇది తెలియజేస్తోంది'' అని కామెంట్ చేశారు.

గత గుజరాత్ ఎన్నికలకు ముందు 2017 ఆగస్టులో చంద్రసింగ్ రౌల్జీ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి మారారు. 2007, 2012లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ఆయన.. బీజేపీలోకి మారిన తర్వాత కేవలం 258 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు.


First Published:  12 Nov 2022 7:36 AM GMT
Next Story