Telugu Global
National

హైవేపై గుంతలు.. రోడ్డుపై బురద నీటి స్నానంతో ఎమ్మెల్యే నిరసన

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపికా పాండే 133 జాతీయ రహదారి దుస్థితిపై ఆందోళన చేపట్టారు. గొడ్డా జిల్లాలో గుంతలమయంగా ఉన్న జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు.

హైవేపై గుంతలు.. రోడ్డుపై బురద నీటి స్నానంతో ఎమ్మెల్యే నిరసన
X

జార్ఖండ్‌లో ప్రస్తుతం జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 సీట్లు ఉండగా..సోరెన్ సారథ్యంలోని కూటమికి 47 సీట్లు ఉన్నాయి. కాగా కొన్ని నెలలుగా జార్ఖండ్‌లో బీజేపీ, జేఎంఎం మధ్య పోరు నడుస్తోంది. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కొద్ది రోజుల కిందట సోరెన్ నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించగా.. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్సు తెచ్చుకున్నారన్న‌ ఆరోపణలతో ఇటీవల ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో జార్ఖండ్‌లో రాజకీయ వేడి రగులుకుంది.

రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపికా పాండే 133 జాతీయ రహదారి దుస్థితిపై ఆందోళన చేపట్టారు. గొడ్డా జిల్లాలో గుంతలమయంగా ఉన్న జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై గుంతల్లో నిల్వ ఉన్న బురద నీటితో స్నానం చేసి నిరసన తెలిపారు. 133 జాతీయ రహదారిని వెంటనే బాగు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరులో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదన్నారు. జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయం అయినప్పటికీ మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. గ‌తుకుల రోడ్డుపై ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా 133 హైవే మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందటే రూ.75 కోట్లు విడుదల చేసినట్లు గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి మరమ్మతులకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని, దూబే అబద్ధాలు చెబుతున్నారని ఎమ్మెల్యే దీపికా పాండే మండిపడ్డారు. కాగా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే బురద నీటి స్నానం చేసి నిరసన తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

First Published:  22 Sep 2022 9:43 AM GMT
Next Story