Telugu Global
National

నిర్బంధంగా హిందీని రుద్ద‌డం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం : ప్ర‌ధానికి త‌మిళ‌నాడు సిఎం లేఖ‌

రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్ర‌యత్నాలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ప్రధానికి ఓ లేఖ రాశారు.

నిర్బంధంగా హిందీని రుద్ద‌డం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం : ప్ర‌ధానికి త‌మిళ‌నాడు సిఎం లేఖ‌
X

కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల‌ను తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్న కమిటీ, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిందీని తప్పనిసరిగా బోధనా మాధ్యమంగా ఉంచాలని సిఫార్సు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని ప్రధాని మోడీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.

"యువత హిందీని చదివితేనే కొన్ని ఉద్యోగాలకు అర్హులు అవుతారని, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తప్పనిసరి పేపర్లలో ఇంగ్లీషును తొలగించాలని సిఫార్సు చేశార‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ చ‌ర్య‌ల‌న్నీ సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని భావిస్తున్నాను. మన రాజ్యాంగం, మన దేశం యొక్క బహుభాషా స్వరూపానికి ఇది హాని కలిగిస్తుంది" అని తమిళనాడు సిఎం అన్నారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో తమిళంతో సహా 22 భాషలు ఉన్నాయని అన్నారు.

భారతీయ యూనియన్‌లో హిందీ మాట్లాడే వారి కంటే హిందీ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని స్టాలిన్ అన్నారు. "ప్రతి భాషకు దాని ప్రత్యేకత, భాషా సంస్కృతితో దాని స్వంత ప్రత్యేకత ఉంది.'' అని స్టాలిన్ అన్నారు.

'భావాలను గౌరవిస్తూ, భారతీయ ఐక్యతను, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్న అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 'హిందీయేతర ప్రజలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికార భాషల్లో ఒకటిగా కొనసాగుతుంది' అని హామీ ఇచ్చారు అన్నారు. తదనంతరం, అధికార భాషపై 1968, 1976లో ఆమోదించిన తీర్మానాలు ప్ర‌కారం యూనియన్ ప్రభుత్వ సేవల్లో ఇంగ్లీషు, హిందీ రెండింటినీ ఉపయోగించాల‌ని నిర్ధారించారు.'' అని తమిళనాడు సీఎం పేర్కొన్నారు.

"కానీ, 'ఒకే దేశం' పేరుతో హిందీని బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి జ‌రుగుతున్న నిరంతర ప్రయత్నాలు వివిధ భాషలు, సంస్కృతుల ప్రజల మ‌ధ్య సోదర భావాన్ని నాశనం చేస్తాయి . భారతదేశ సమగ్రతకు హానికరం అని నేను భయపడుతున్నాను" అని స్టాలిన్ త‌న లేఖ‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

First Published:  16 Oct 2022 12:51 PM GMT
Next Story