Telugu Global
National

డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవం

పార్టీ తరఫున అధ్యక్ష పదవి స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిన‌ట్టు డీఎంకే ప్రకటించింది.

డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవం
X

ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ తరఫున అధ్యక్ష పదవి స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిన‌ట్టు డీఎంకే ప్రకటించింది. డీఎంకేను 1949లో సీఎన్ అన్నాదురై స్థాపించారు. అయితే పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో పార్టీలో అధ్యక్ష పదవి లేదు. అత్యున్నత పదవిగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఉండేది. 1969లో అన్నాదురై మరణించే వరకు ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.

ఆ తర్వాత అదే సంవత్సరం కరుణానిధి డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా పార్టీలో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 2018లో కరుణానిధి మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం ఆయనకిది రెండవసారి.

అంతకుముందు స్టాలిన్ డీఎంకే కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పదవులను నిర్వ‌హించారు. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నాయకుడు దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ సహా ఈ ముగ్గురు నేతలు రెండోసారి తమ తమ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

First Published:  9 Oct 2022 8:54 AM GMT
Next Story