Telugu Global
National

జమ్మూకశ్మీర్‌లో అదృశ్యమైన ఆర్మీ జవాన్ దొరికేశాడు

గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చిన సంఘటనలు జరిగాయి.

జమ్మూకశ్మీర్‌లో అదృశ్యమైన ఆర్మీ జవాన్ దొరికేశాడు
X

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో అదృశ్యమైన ఆర్మీ జవాన్‌ ను సురక్షితంగా కాపాడారు. జవాన్‌ను కుల్గామ్ పోలీసులు కనిపెట్టారని కాశ్మీర్‌ అదనపు జనరల్ ఆఫ్ పోలీసు అధికారి ఒకరు ట్వీట్‌ చేశారు. జవాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, పోలీసులు, ఆర్మీ జరిపే ఉమ్మడి విచారణ త్వరలో ప్రారంభమవుతుందని వివరించారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని భద్రతా దళాలు ప్రకటించాయి. జవాన్‌ అదృశ్యం గురించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ అతన్ని ఉగ్రవాదులే అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు.

కుల్గామ్‌ జిల్లా అచతల్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల జావేద్‌ అహ్మద్‌ వానీ, లద్దాఖ్‌లోని లేహ్‌లో లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వహిస్తున్నారు. సెలవులపై ఇంటికి వచ్చిన ఆయన సడన్ గా అదృశ్యమయ్యాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అతని కారును గుర్తించగా అది లాక్ చేయకపోగా అందులో జావేద్‌ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, జవాన్‌ జాడ కోసం ఆర్మీ, పోలీసులు ముమ్మరంగా.. గాలింపు చేపట్టారు. భద్రతా దళాలు కారు కనిపించిన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని.. జల్లెడపట్టి వానీని గుర్తించి రక్షించాయి.

గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చిన సంఘటనలు జరిగాయి. కానీ వానీకి ఎలాంటి హాని జరగకపోవడంతో జవాన్‌ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపాయి.

కాశ్మీర్‌లో సెలవులో ఉన్న సమయంలో అదృశ్యమైన నాల్గో సైనికుడు వానీ. 2017మే లో తన బంధువుల ఇంటికి వచ్చిన లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఇక 2018లో సైన్యంలోని 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న ఔరంగజేబు అనే సైనికుడిని కూడా ఇలాగే హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. కొంతకాలం తరువాత ప్రభుత్వం రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబుకు శౌర్యచక్రను బహూకరించింది.

First Published:  4 Aug 2023 5:07 AM GMT
Next Story