Telugu Global
National

ఎల్ఐసీ, ఎస్బీఐలను అదానీ ఊబిలోకి నెట్టింది ఎవరు..?

అసలు ఈ రెండు సంస్థలు అంత భారీస్థాయిలో ఏ ప్రాతిపదికన అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టాయన్న దానిపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

ఎల్ఐసీ, ఎస్బీఐలను అదానీ ఊబిలోకి నెట్టింది ఎవరు..?
X

పెరుగుట ఇరుగుటకే అన్న సామెతకు ఇప్పుడు అదానీ గ్రూప్ పతనం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. కేంద్ర పెద్దలు తన దోస్తులే కావడంతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తెస్తూ ఈ దేశంలో పోర్టుల నుంచి ఎయిర్ పోర్టుల వరకు, పవర్ నుంచి గ్యాస్ సెక్టార్ వరకు ప్రతి రంగంలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన అదానీ గ్రూప్‌కి హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఒక మిస్సైల్‌లా వచ్చి తాకింది.

రిపోర్టు బయటికి వచ్చిన తర్వాత వరుసగా రెండు రోజులపాటు గ్రూప్ షేర్లు భారీగా పతనమవ్వ‌డంతో పాటు ఆ గ్రూప్ కంపెనీలతో ఆర్థిక సంబంధాలున్న సంస్థల షేర్లు కూడా షేక్ అయ్యాయి. గ్రూప్ వృద్ధి ఒక నీటి బుడగ తరహాలో ఉందని, కేవలం స్టాక్ మార్కెట్లో మాయాజాలం ప్రదర్శిస్తూ షేర్ విలువలను భారీగా పెంచుకుంటూ ఆ పెరిగిన షేరు ధరలను చూపెడుతూ భారీగా అప్పులు తేవడం మినహా సహజమైన వృద్ధిలేదని అమెరికా సంస్థ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.


అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టినవారు 80% వరకు నష్టపోవచ్చు అని ఆ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టిన, రుణాలు ఇచ్చిన ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా నష్టపోయాయి. అసలు ఈ రెండు సంస్థలు అంత భారీస్థాయిలో ఏ ప్రాతిపదికన అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టాయన్న దానిపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

అదానీ గ్రూప్‌కి ఎల్ఐసీ 77 వేల కోట్లు, ఎస్బీఐ 80 వేల కోట్ల రూపాయ‌ల‌ మేర నిధులు సమకూర్చాయి. ఇలా ఎందుకు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ దిశగా ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలను నెట్టింది ఎవరని నిలదీశారు. మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారని ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఇవి సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ సంస్థ కేవలం రెండు రోజుల్లోనే 18 వేల కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్లో నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ప్రభుత్వ రంగ సంస్థలు అదానీ గ్రూపున‌కు భారీగా నిధులు సమకూర్చినట్లు భావిస్తున్నారు.

First Published:  28 Jan 2023 4:19 PM GMT
Next Story