Telugu Global
National

మోదీ మాయ.. మంచినీటి వ్యాపారంలో మనదే ఘనత

2018-21వ సంవత్సరాల మధ్య దేశ సగటు వృద్ధిరేటు తగ్గింది. విశేషం ఏంటంటే.. మినరల్‌ వాటర్‌ మార్కెట్‌ మాత్రం 27.1 శాతం వృద్ధిని సాధించింది. ఇది ప్రపంచంలోనే రెండో స్థానం.

మోదీ మాయ.. మంచినీటి వ్యాపారంలో మనదే ఘనత
X

ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు, ఆ ఇంటికో మంచినీటి కుళాయి. 2022నాటికల్లా ఇది తథ్యం అన్నారు మోదీ. ఆ హామీల అమలు ఏ స్థాయిలో ఉందో గణాంకాలే చెబుతున్నాయి. ఇల్లు లేని నిరుపేదలు ఇంకా నిలువ నీడకోసం అపస్థలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా తాగునీటి సౌకర్యం సరిగా లేక ప్రజలు మినరల్ వాటర్ ని కొనుక్కొంటున్నారు. నిత్యావసరాల రేట్లు ఎలాగూ పెరిగిపోయాయి. గ్యాస్ బండ, పెట్రోల్, డీజిల్.. ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోడానికి కూడా ఎవరూ సాహసించే పరిస్థితుల్లో లేరు. ఇక మంచినీటి వ్యాపారం సామాన్యులకు మరో శరాఘాతంగా మారింది.

దేశం అభివృద్ధి తక్కువ.. నీళ్ల వ్యాపారం ఎక్కువ..

2018-21వ సంవత్సరాల మధ్య దేశ సగటు వృద్ధిరేటు తగ్గింది. విశేషం ఏంటంటే.. మినరల్‌ వాటర్‌ మార్కెట్‌ మాత్రం 27.1 శాతం వృద్ధిని సాధించింది. ఇది ప్రపంచంలోనే రెండో స్థానం. 28 శాతంతో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో ఉండగా.. మినరల్ వాటర్ వ్యాపారంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. వాటర్ బాటిల్స్ విక్రయాల్లో 12.5 శాతం వృద్ధి సాధించింది భారత్.

ప్రపంచ వ్యాప్తంగా 2021లో ప్రజలు రూ.22 లక్షల కోట్లు వెచ్చించి మంచినీరు కొనుక్కుని తాగారు. 2030 నాటికి మంచినీటిపై ప్రజలు పెట్టే ఖర్చు రూ.41.5 లక్షల కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా 2030 నాటికి అందరికీ సురక్షిత నీరు అందించాలని నిర్దేశించుకున్నా.. దాన్ని సాధించలేకపోతున్నామని, ప్రతిగా మంచినీటిపై ప్రజలు పెట్టే ఖర్చు భారీగా పెరిగిపోతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

వినియోగంలో సింగపూర్ టాప్..

వాటర్ బాటిల్స్ అంతర్జాతీయ మార్కెట్‌ లో సగం అమెరికా, చైనా, ఇండోనేసియాలది. నీటి వినియోగంలో సింగపూర్ ముందు వరుసలో ఉంది. సింగపూర్ లో సగటున ఓ వ్యక్తి మంచినీటికోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉంది. అమెరికా, చైనాలో ఉత్పత్తి, మార్కెటింగ్ ఎక్కువగా ఉన్నా తలసరి వినియోగం తక్కువ కావడం గమనార్హం.

భారత్ లో మంచినీటి వ్యాపారం ఆందోళనకర స్థాయిలో పెరగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ మంచినీరు సరఫరా చేస్తున్నా.. కేంద్రం నుంచి అందుతున్న సాయం నామమాత్రమే. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ సాయం మరీ దారుణ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి రాజకీయాల వల్లే మోదీ చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అందుకే భారత్ లో మినరల్ వాటర్ వ్యాపారం భారీగా పెరిగింది.

First Published:  17 March 2023 12:53 AM GMT
Next Story