Telugu Global
National

కుప్పకూలిన మిగ్-29.. మూడేళ్లలో ఇది నాలుగోసారి..

భారత్ లో ఇవి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత మూడేళ్లలో మూడు సార్లు మిగ్-29లు ప్రమాదాలబారిన పడ్డాయి. తాజాగా జరిగిన ప్రమాదం నాలుగోది.

కుప్పకూలిన మిగ్-29.. మూడేళ్లలో ఇది నాలుగోసారి..
X

మిగ్ విమానాలకు ఎగిరే శవపేటికలుగా పేరుంది. ఇప్పటి వరకూ పదులకొద్దీ మిగ్-21 విమాన ప్రమాదాలు జరిగాయి. 200మందికి పైగా పైలట్లు ఈ ప్రమాదాల్లో మరణించారు. వీటి వ్యవహారంలో గత ప్రభుత్వాలను తీవ్రంగా తప్పుబట్టిన ఎన్డీఏ సర్కారు, తమ హయాంలో జరుగుతున్న ప్రమాదాలను నివారించలేకపోతోంది. విమర్శలు మూటగట్టుకుంది. మిగ్-29 వ్యవహారం కూడా అలాగే తయారైంది. భారత్ లో ఇవి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత మూడేళ్లలో మూడు సార్లు మిగ్-29లు ప్రమాదాలబారిన పడ్డాయి. తాజాగా జరిగిన ప్రమాదం నాలుగోది.

నావికాదళానికి చెందిన మిగ్‌ 29-కె విమానం గోవా తీరం నుంచి గాల్లోకి ఎగిరి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ముందుగానే ప్రమాదాన్ని గుర్తించిన ఇద్దరు పైలట్లు దాన్ని వదిలేసి సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి నావికాదళం ఆదేశాలు జారీ చేసింది. 2019లో గోవాలోని ఓ గ్రామ శివారులో నావికాదళానికి చెందిన మిగ్‌ 29-కె ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుంచి పైలట్లు సరక్షితంగా బయటపడ్డారు. 2020 ఫిబ్రవరిలో మిగ్‌ 29-కెను పక్షి ఢీకొంది. దీంతో పైలట్లు తీవ్రంగా శ్రమించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి దిగిపోయారు. 2020 నవంబర్ లో మిగ్ 29-కె కుప్పకూలగా ఒక పైలట్ మరణించారు, మరో పైలట్ గాయపడ్డారు.

వీడ్కోలు ఎప్పుడు..

ఎగిరే శవపేటికలుగా పేరున్న మిగ్ విమానాలను రక్షణ దళాలనుంచి తొలగిస్తామని పదే ప్రభుత్వాలు చెబుతున్నా, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మిగ్ 21 విమానాలను 2025నాటికి పూర్తిగా తొలగిస్తామంటున్నారు. మిగ్-29 విమానాలకు 2027నాటికి వీడ్కోలు పలుకుతామంటున్నారు. అయితే ఈలోగా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉండటం బాధాకరం. ఈ ప్రమాదాలపై బీజేపీ ఎంపీలు కూడా పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, తమ ప్రభుత్వాన్నితీవ్రంగా తప్పుబట్టారు. విమాన ప్రమాదాలతో విలువైన పైలట్ల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. కానీ కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం. దానికి తాజా ఉదాహరణే ఈరోజు జరిగిన ప్రమాదం.

First Published:  12 Oct 2022 10:34 AM GMT
Next Story