Telugu Global
National

ఇకపై ప్రతీ జిల్లాలో ప్రత్యేక సైబర్ వింగ్.. కసరత్తు చేస్తోన్న కేంద్ర హోం శాఖ!

సైబర్ దాడులు పెరిగిపోవడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీలతో సమావేశం నిర్వహించారు.

ఇకపై ప్రతీ జిల్లాలో ప్రత్యేక సైబర్ వింగ్.. కసరత్తు చేస్తోన్న కేంద్ర హోం శాఖ!
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సర్వర్లు, సైట్లపై హ్యాకర్ల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్‌పై హ్యాకర్ల దాడి కారణంగా కొన్ని రోజుల పాటు ఓపీ, ఐపీ సేవలు అందించడం కష్టంగా మారింది. ఈ దాడుల వెనుక చైనా, నార్త్ కొరియాకు చెందిన హ్యాకర్లే ఉన్నట్లు సెర్ట్-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియన్) ప్రాథమికంగా అంచనా వేసింది. 2022లో ప్రభుత్వ సంస్థలపై 82 సార్లు దాడులకు ప్రయత్నించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021తో పోల్చితే ఇవి పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

సైబర్ దాడులు పెరిగిపోవడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీలతో సమావేశం నిర్వహించారు.ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో 'స్పెషల్ సైబర్ వింగ్' ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త వింగ్ ప్రభుత్వ శాఖలపై జరిగే సైబర్ దాడులను ముందుగానే గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం వంటి పనులు చేస్తుందని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్లును వీటితో కలపకుండా ప్రత్యేకంగా నిర్వహించాలని కేంద్ర హోం శాఖ చెప్పింది. ఈ సైబర్ వింగ్‌ కేవలం ప్రభుత్వ శాఖలపై జరిగే సైబర్ ఎటాక్స్‌ను మాత్రమే గుర్తించేందుకు పని చేస్తుందని అన్నారు. ఈ వింగ్‌లో పని చేసేందుకు అవసరమైన సిబ్బందికి సెర్ట్-ఇన్ శిక్షణ ఇవ్వనున్నది. ముందుగా రాష్ట్ర స్థాయిలోని సీనియర్ అధికారులకు అవసరమైన శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక సైబర్ వింగ్‌లో పని చేసే సిబ్బందిని సైబర్ వారియర్ లేదా సైబర్ కమాండో అనే పేరుతో పిలవనున్నారు. అవసరం అయితే ఇతర సైబర్ పోలీస్ స్టేషన్లు కూడా వీరి సహాయం తీసుకోవచ్చు. ఈ సైబర్ యూనిట్లకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్దత కల్పించాలని, అవసరమైన సిబ్బందిని కేటాయించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  31 Jan 2023 5:35 AM GMT
Next Story