Telugu Global
National

కేంద్ర ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ షాకింగ్ కామెంట్స్

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే తనను ఉపరాష్ట్రపతి చేస్తామన్నారని వెల్లడించారు మాలిక్. ఈడీ బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
X

భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై, అది చేసే నిర్ణయాలపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ లు ఎప్పుడూ విమర్శలు సంధిస్తూనే ఉంటారు. దేశంలో ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు పోరాడినప్పుడు సత్యపాల్ మాలిక్ రైతులకు మద్దతుగా నిలబడ్డారు. ఇలా ప్రతి సారీ బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మాలిక్ తాజాగా సంచలన విషయాలు మాట్లాడారు.

దేశంలో విపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ చేస్తున్న దాడులను దృష్టిలో పెట్టుకొని సత్యపాల్ మాలిక్, చాలా మంది బీజేపీ నేతలపై కూడా ఈడీ దాడులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రతిపక్ష నేతలపైనే ఎందుకు దాడులు చేస్తున్నారు ? బీజేపీ నేతల్లో అక్రమాలు చేస్తున్నవాళ్ళు అనేక మంది ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదాయన. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే తనను ఉపరాష్ట్రపతిని చేస్తామన్నారని వెల్లడించారు. జగదీప్ ధంఖర్ ఉప రాష్ట్రపతి అవడం గురించి మీడియా మాలిక్ ను అడిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడమే దానికి అర్హత అన్నట్టు మాట్లాడిన మాలిక్ తాను అలా ఉండలేనన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేపట్టినందుకు ఆయనను ప్రశంసించారు మాలిక్. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఇది మంచిదని మాలిక్ అన్నారు.

యాత్ర ఏమి సందేశం ఇచ్చింది అని అడిగినప్పుడు, మాలిక్, "నాకు అది తెలియదు, అది ప్రజలే చెప్పాలి, కానీ అతను చేస్తున్న పని సరైనదని నేను భావిస్తున్నాను." అన్నారు సత్యపాల్ మాలిక్

దేశ రాజధానిలోని రాజ్‌పథ్ పేరును మార్చడంపై ఆయన స్పందిస్తూ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నారు. రాజ్‌పథ్ అనే పేరు బాగుంది, "కర్తవ్య‌ మార్గం" అనే పేరు మంత్రంలా ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేరేలా కనిపించడం లేదని, రైతుల డిమాండ్ల కోసం త్వరలో మళ్ళీ ఆందోళన చేపడతామని, రైతుల ప్రయోజనాల కోసం తాను కూడా తన గళాన్ని ఎత్తుతానని మాలిక్ చెప్పారు.

పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఆస్థుల పెరుగుదలపై స్పందిస్తూ, ఆయన సంపద తక్కువ సమయంలో చాలా ఎక్కువ‌ పెరిగిందని, అయితే రైతుల సంపద మాత్రం మరింత తగ్గుముఖం పట్టిందని సత్యపాల్ మాలిక్ అన్నారు.

Next Story