Telugu Global
National

జ్యోతిష్యం పేరుతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీడియా

నిన్న ఓ ప్రైవేటు హిందీ ఛానల్ క్రికెట్ పై జ్యోతిష్కులతో ఓ లైవ్ కార్యక్రమం నిర్వహించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ గెలుస్తుందా లేదా అనేది ఆ చర్చా కార్యక్రమం టాపిక్. ఇందులో 11 మంది జ్యోతిష్కులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్నవాళ్ళందరూ ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచితీరుతుందని చెప్పారు.

జ్యోతిష్యం పేరుతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీడియా
X

సమస్యలు పెరుగుతున్న కొద్దీ మనుషులు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల మీద ఆధారపడటం కూడా పెరుగుతోంది. దీంట్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళుకూడా మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఎక్కువగా వీటి మీద ఆధారపడుతున్నారు. ప్రజల బలహీనత ఆసరా చేసుకొని మీడియా కూడా ఇటువంటి వాటిని ప్రచారం, ప్రసారం చేస్తోంది. ఇప్పుడు ఏ ఛానల్ లో చూసినా తప్పకుండా జ్యోతిష్యం, రుద్రాక్ష, రంగురాళ్ళ ఉంగరాలు... వంటి ప్రోగ్రాం లు తప్పని సరిగా ఉంటున్నాయి. ఈ విషయంలో కొన్ని ఛానళ్ళైతే అన్ని విషయాలకు జ్యోతిష్యాన్ని జత చేసి ప్రచారం చేస్తున్నాయి.

నిన్న ఓ ప్రైవేటు హిందీ ఛానల్ క్రికెట్ పై జ్యోతిష్కులతో ఓ లైవ్ కార్యక్రమం నిర్వహించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ గెలుస్తుందా లేదా అనేది ఆ చర్చా కార్యక్రమం టాపిక్. ఇందులో 11 మంది జ్యోతిష్కులు పాల్గొన్నారు. అందరూ జ్యోతిష్యంలో తలపండిన వాళ్ళే.

ఆచార్య‌ ఎస్ గణేష్, ఆచార్య రాకేష్ చతుర్వేది, ఆచార్య డీపీ శాస్త్రి, ఆచార్య అనీల్ వస్త్, డాక్ట‌ర్ పూజా భాటియా, ఆచార్య గోవింద్ జోషి, ఆచార్య శైలేష్ తివారి, శృతి సింగ్. డాక్టర్ అజయ్ బాంబీ, సుఖేష్ శర్మన్, రాజ్ మిత్రా అనే ప్రఖ్యాత జ్యోతిష్కులు ఇందులో పాల్గొన్నారు.

ఇందులో నిన్న ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తో సహా ఫైనల్ మ్యాచ్ గురించి కూడా చర్చ‌ చేశారు. రాహువు, కేతువు, శని, శుక్రుడు, సూర్యుడు... వారి వారి కదలికల పై ఆధారపడి, ఆటగాళ్ళ జాతకచక్రం అంచనా వేసి చివరకు సెమీ ఫైనల్స్ లోనే కాదు. ఫైనల్స్ లోనూ ఇండియా టీం గెలుస్తుందని, ఈ సారి ప్రపంచ కప్ మనదే అని కుండబ‌ద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యంత కాన్ఫిడెంట్ గా ఈ విషయం చెప్పారు. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో ఓడి పోయిన ఇండియా టీం కూడా వీరి వాదన వి‍ంటే తమ ఓటమి అబద్దమనుకునేంతగా ఈ 11 మంది వాదనలు సాగాయి. రెండున్నర గంటల పాటు వీళ్ళ వాదనల తర్వాత వచ్చిన ఫలితం ఏంటంటే, వీళ్ళంతా చెప్పిన దానికి విరుద్దంగా ఇండియా సెమీ ఫైనల్ లోనే ఓడిపోయింది. ఇక ప్రపంచ కప్ గెల్చే అవకాశమే లేదు.

మరి ఈ ఓటమిపై ఆ 11 మంది ఏమంటారో అనే విషయంపై ఆ ఛానల్ మళ్ళీ చర్చా కార్యక్రమం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. తమ టీఆర్పీలు పెంచుకోవడానికి టీవీ ఛానళ్ళు ఎటువంటి ప్రోగ్రాం ప్రసారం చేయడానికైనా రెడీ అయిపోతున్నాయి. తమ పేరు ప్రఖ్యాతుల కోసం ఈ జ్యోతిష్కులు ఏం చెప్పడానికైనా సిద్దమై పోతున్నారు.

దీనికి ఉగాది పంచాంగ పఠనాలు మంచి ఉదహరణ. వీరిపై జనాలు జోకులు వేసుకునేంత గా దిగజారిపోయారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యలయాల్లో జరిగే పంచాంగ పఠనాలు చేసే పండితులను ప్రజలు కార్టూన్ లలాగా చూసే పరిస్థితి వ‌చ్చింది. ఏ పార్టీ కార్యాలయంలో పంచాంగం పఠించే పండితుడు రాబోయే ఎన్నికలలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని, పంచాంగం అదే చెప్తుందని డంకా భజాయించి మరీ చెప్తాడు. ఆ తర్వాత తాను గెలుస్తుందని చెప్పిన పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినప్పటికీ దాని గురించి మాట్లాడక పోవడం తాము చేసిన తప్పును ఒప్పుకోకపోవడం వాళ్ళ నిజాయితీలేని తనానికి పరాకాష్ట.

ఇలాంటిదే ఈ క్రికెట్ జ్యోతీష్య ఎనాలసిస్. వాళ్ళు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని తేలిన తర్వాత కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా మళ్ళీ అవే అబద్దాలను కొనసాగించడం ప్రజల బలహీనతలతో ఆడుకోవడం వీళ్ళ రోజు వారీ కార్యక్రమం.

First Published:  11 Nov 2022 10:19 AM GMT
Next Story