Telugu Global
National

బీహార్ లో భారీగా మహిళా పోలీస్ ల రిక్రూట్ మెంట్.. ఎందుకంటే..?

రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 170 మంది పోలీసులను నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మహిళల ప్రాధాన్యాన్ని 35 శాతానికి పెంచబోతున్నట్టు ప్రకటించారు.

బీహార్ లో భారీగా మహిళా పోలీస్ ల రిక్రూట్ మెంట్.. ఎందుకంటే..?
X

బీహార్ ప్రభుత్వం మహిళా పోలీస్ ల రిక్రూట్ మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. కొత్తగా రిక్రూట్ అయిన 10,459 మందికి అపాయింట్‌ మెంట్ లెటర్‌ లను అందించారు సీఎం నితీష్ కుమార్. ఈ రిక్రూట్ మెంట్ తో బీహార్ లో మహిళా పోలీసుల సంఖ్య 28 శాతానికి పెరిగిందని, ఇకపై బీహార్ పోలీస్ శాఖలో మహిళల ప్రాధాన్యాన్ని 35 శాతానికి పెంచబోతున్నట్టు ప్రకటించారాయన.

ఎందుకంటే..?

బీహార్‌ రాష్ట్ర పోలీసు విభాగంలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా వారి రక్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, నూతన విధానాలు అమలు చేయడం వంటివి పెరుగుతాయని చెప్పారు సీఎం నితీష్ కుమార్. పోలీస్ శాఖలో మొత్తం నియామక ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. బీహార్ పోలీస్‌ శాఖలో 1.5 లక్షల రిక్రూట్‌ మెంట్ల లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామని చెప్పారు. ప్రస్తుతం 1.08 లక్షల నియామకాలు మాత్రమే జరిగాయని అన్నారు.

లక్షమంది ప్రజలకు 170మంది పోలీసులు

రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 160 నుంచి 170 మంది పోలీసులను నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించారు సీఎం నితీష్ కుమార్. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 115 మంది పోలీసులను నియమించాలని గతంలో నిర్ణయించామని, ఇప్పుడు ఆ నిష్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీహార్‌ లో చట్టబద్ధమైన పాలనను కొనసాగించే ప్రయత్నంలో పోలీసుల పనిని విచారణ మరియు శాంతిభద్రతల నిర్వహణ అనే రెండు భాగాలుగా విభజించామన్నారు. కోర్టులో సరైన విచారణ తర్వాత నేరస్థులకు త్వరగా శిక్షలు పడేలా 60 రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పోలీసింగ్ గణనీయంగా మెరుగుపడిందని, కుల మతాల పేరుతో సమాజంలో చీలికలు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీహార్ ప్రభుత్వంలోని వివిధ శాఖలలో రిక్రూట్‌ మెంట్ డ్రైవ్ కొనసాగుతోందని, భవిష్యత్తులో రాష్ట్ర పోలీసు శాఖలో మరిన్ని రిక్రూట్‌ మెంట్లు జరుగుతాయన్నారు. ప్రస్తుతం యువత రక్షణ సేవల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయడం కంటే బీహార్ పోలీసు ఉద్యోగాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు తేజస్వి యాదవ్.

First Published:  17 Nov 2022 3:34 AM GMT
Next Story