Telugu Global
National

ఢిల్లీలో కలకలం.. మహిళ తలకు గన్ పెట్టి మెడలోని బంగారం దోపిడీ.. వీడియో వైరల్

దుండగుడు మహిళ నుంచి నెక్లెస్ లాక్కొని బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దృశ్యాలన్నీ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

ఢిల్లీలో కలకలం.. మహిళ తలకు గన్ పెట్టి మెడలోని బంగారం దోపిడీ.. వీడియో వైరల్
X

నడిరోడ్డులో పట్టపగలు అందరూ చూస్తుండగా.. ఓ దుండగుడు మహిళ తలకు గన్ పెట్టి బెదిరించి ఆమె మెడలోని బంగారాన్ని దోపిడీ చేశాడు. అడ్డొచ్చిన వారికి గన్ చూపుతూ బెదిరించి బైక్‌పై పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అందరూ చూస్తుండగా దోపిడీ జరగడం కలకలం రేపుతోంది

ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు శనివారం రోహిణి ప్రాంతానికి వచ్చారు. ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న షాపు వద్ద నిల్చుని ఉండగా దుండగులు గమనించారు. ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్‌ను రన్నింగ్‌లోనే ఉంచి అక్కడే ఉండగా.. మరో దుండగుడు గన్ చేత పట్టుకొని మహిళ వద్దకు వచ్చాడు. అతడు ఆ మహిళకు గన్ చూపి మెడలోని గొలుసు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఆమె దుండగుడి నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న షాప్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.

అయితే దుండగుడు ఆమెను కింద పడేసి తలకు గన్ పెట్టి బెదిరించి మెడలోని నెక్లెస్ లాక్కున్నాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో షాప్‌లో ఉన్న యువకుడు మహిళను కాపాడేందుకు బయటకు వచ్చాడు. అయితే దుండగుడు అతడిని కూడా గన్‌తో బెదిరించడంతో అతడు మళ్లీ షాపులోకి పరుగులు తీశాడు. దుండగుడి చేతిలో గన్ ఉండడంతో చుట్టుపక్కలవారు మహిళను కాపాడటానికి ధైర్యం చేయలేకపోయారు.

దుండగుడు మహిళ నుంచి నెక్లెస్ లాక్కొని బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దృశ్యాలన్నీ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. గన్ చేతిలో పట్టుకుని దుండగుడు రావడం, మహిళను కింద పడేసి నెక్లెస్ లాక్కోవడం, అడ్డొచ్చిన యువకుడిని బెదిరించడం వంటి దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు.

First Published:  16 April 2023 7:14 AM GMT
Next Story