Telugu Global
National

పశ్చిమబెంగాల్ లో మళ్లీ మాస్క్ నిబంధన

పశ్చిమబెంగాల్ లో మళ్లీ మాస్క్ నిబంధన తప్పనిసరి చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మాస్క్ ధరించాల్సిందేనని, పెద్దవారు కచ్చితంగా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం.

West Bengal
X

పశ్చిమబెంగాల్ లో మళ్లీ మాస్క్ నిబంధన

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా అందరూ మాస్క్ మరచిపోయారు. అక్కడక్కడా కొంతమంది మాత్రమే మాస్క్ లతో కనపడుతున్నారు. మాస్క్ నిబంధన కూడా ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో మళ్లీ మాస్క్ నిబంధన తప్పనిసరి చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మాస్క్ ధరించాల్సిందేనని, పెద్దవారు కచ్చితంగా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం.

అడెనో వైరస్..

ఇటీవల కాలంలో అక్కడక్కడా కరోనా లక్షణాలు కనపడుతున్నా.. అది కరోనా కాదని వైద్యులు చెబుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చినవారిలో అడెనో వైరస్ బయటపడింది. కానీ అది కరోనా అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇది కూడా ఒకరినుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపించే లక్షణాలతో ఉంటుంది కాబట్టి, అడెనో వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది పశ్చిమబెంగాల్ ప్రభుత్వం. పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కపడతున్నాయి కాబట్టి, వారికి మాస్క్ తప్పనిసరి అంటూ పాత నిబంధన పునరుద్ధరించింది.

అడెనోవైరస్ కారణంగా ఇటీవల 19మంది చిన్నారులు మరణించినట్టు పశ్చిమబెంగాల్ అధికారిక నివేదిక విడుదల చేసింది. పిల్లలు భయపడవద్దని, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. పిల్లలకు దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, జ్వరం వస్తే ఆస్పత్రిలో చేర్చించాలని సూచించారు.

అడెనోవైరస్ కారణంగా పిల్లలు తేలికపాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారని బెంగాల్ వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించాలంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే అది న్యుమోనియాగా మారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. అడెనో వైరస్ కారణంగా పశ్చిమ బెంగాల్‌ లోని చాలా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్లు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలతో నిండిపోయాయి. ఇది మరింత విజృంభించకుండా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది.

First Published:  7 March 2023 2:23 AM GMT
Next Story