Telugu Global
National

Face book Love : మాది ప్రేమ కాదు స్నేహమే.. జైపూర్ చూడటానికి వెళ్తున్నానని చెప్పి పాకిస్తాన్‌కు ప్రయాణం..

అంజుకి ఫేస్‌బుక్ ద్వారా నస్రుల్లాఖాన్‌ పరిచయం అయ్యాడు. నస్రుల్లాను కలుసుకోవడానికి గత గురువారం పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉన్న అప్పరి దిర్ జిల్లాకు అంజు వెళ్లింది.

Face book Love : మాది ప్రేమ కాదు స్నేహమే.. జైపూర్ చూడటానికి వెళ్తున్నానని చెప్పి పాకిస్తాన్‌కు ప్రయాణం..
X

ప్రేమ సరిహద్దులు చెరిపేసింది.. ఎల్లలు దాటేసింది.. ఇలాంటివన్నీ మనం విన్న మాటలు. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అవన్నీ కళ్ళారా చూస్తున్నాం. సరిగ్గా 2 నెలల క్రితం పాక్‌కు చెందిన సీమా హైదర్‌ అనే మహిళ భర్తను వదిలి నలుగురు పిల్లలతో సహా పబ్జీలో పరిచయమైన భారత్‌లోని ప్రియుడి చెంతకు చేరింది. ఆమె నిజమైన ప్రేమికులారా లేక పాకిస్తాన్ ఏజెంటా అన్న సంగతి ఇంకా మనకి పూర్తిగా తేలనే లేదు.. ఇప్పుడు మరో ప్రేమకథ‌ దేశం దాటేసింది. నచ్చిన వాడికోసం అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ పాకిస్తాన్‌కు వెళ్ళింది.. అయితే ఎప్పుడైతే మీడియా, పోలీసులు జోక్యం చేసుకున్నారో వెంటనే మాది ప్రేమ కాదు స్నేహమే అని చెబుతోంది అంజు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ అల్వార్ జిల్లాలోని భివాడి ప్రాంతానికి చెందిన అంజుకి అరవింద్ అనే వ్య‌క్తితో 2007లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె వయస్సు 15 ఏళ్లు కాగా, కుమారుడికి 6 సంవ‌త్స‌రాలు. అంజుకి ఫేస్‌బుక్ ద్వారా నస్రుల్లాఖాన్‌ పరిచయం అయ్యాడు. నస్రుల్లాను కలుసుకోవడానికి గత గురువారం పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉన్న అప్పరి దిర్ జిల్లాకు అంజు వెళ్లింది. అక్కడ ఆమెను పాక్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అయితే అంజుకు పాస్ పోర్ట్, వీసా, అన్ని పత్రాలు సరిగా ఉండటంతో విడిచిపెట్టారు.

గురువారం నాడు ఇంటి నుంచి బయలుదేరిన అంజు భర్తకు రాజస్థాన్ చూడడానికి వెళ్తున్నాన‌ని చెప్పింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ఫోన్ చేసి తాను లాహోర్ లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది. అంజు భర్త కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. స్నేహితుడిని కలవడానికి వెళ్ళింది కాబట్టి ఆమె తిరిగి వస్తుందని భావిస్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పుడు విషయం మీడియాకు పొక్కింది. ప్రేమ కోణం బయట పడింది.. మరో ప్రేమ కథ‌ అన్న వార్తల నేపథ్యంలో అంజు ఈసారి మీడియానే కాంటాక్ట్ అయ్యింది.

పాకి‌స్తాన్‌లో తన స్నేహితుని వివాహ వేడుకలో పాల్గొనేందుకే వచ్చానని, 2 నుంచి 4 రోజుల్లో భారత్‌కు తిరిగి రానున్నట్లు తెలిపింది. తాను సీమా హైదర్‌లా కాదని, నస్రుల్లాను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. అన్ని నిబంధనలు పాటించే తాను పాకిస్తాన్‌ వచ్చా నని చెప్పిన అంజు, ఈ విషయం తన భర్తకు చెప్పలేదని మాత్రం అంగీకరించింది. అయితే మాటల్లో అంజు తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.

భర్త మాత్రం ఇన్నేళ్లలో అంజుపై తనకు అనుమానం రాలేదని, ఆమె పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయమే తనకు తెలియదన్నాడు. అయితే పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే ఆమె ప్రయాణానికి కారణమని భావిస్తున్నారు. అంజు, నస్రుల్లాఖాన్‌ తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకునేవార‌ని చెబుతున్నారు. అంజు 2020లో పాస్‌పోర్టు అప్ల‌య్‌ చేసిందని నిర్ధారించారు. ఒకవేళ పాస్‌పోర్ట్‌ చట్టం ప్రకారం నకిలీ డాక్యుమెంట్లతో ఆమె పాక్‌కు వెళ్తే చర్యలు తప్పవ‌ని హెచ్చ‌రించారు.

మరోవైపు ఆమె భారత్‌కు తిరిగి వస్తుందా.. లేదా సీమా హైదర్‌ లాగా ప్రేమించిన వాడితో అతని దేశంలోనే ఉండిపోవాలని అనుకుంటోందా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First Published:  24 July 2023 11:52 AM GMT
Next Story