Telugu Global
National

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ

మనీశ్ సిసోడియా అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది. సిసోడియా అరెస్టు నియంతృత్వపు చర్య అని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ
X

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ కాసేపటి క్రితం అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం నుంచి దాదాపు 8 గంటల సేపు సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. సాయంత్రం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. లిక్కర్ పాలసీ 2021-22 (ఇప్పుడు రద్దు చేశారు) తయారీ, షాపుల అప్పగింత విషయంలో సిసోడియా కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ మొదటి నుంచి ఆరోపిస్తోంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా తయారు చేసుకున్నారని, అలాగే మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు కూడా తీసుకున్నట్లు సీబీఐ చెబుతోంది.

ఈ రోజు ఉదయం 11.15కు సీబీఐ కార్యాలయానికి వచ్చిన సిసోడియాను సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు విచారించారు. నిబంధనలకు విరుద్దంగా టెండర్లు అప్పగించారనేది సిసోడియాపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై ఇవ్వాళ అధికారులు మనీశ్‌ను ప్రశ్నించారు. అయితే ఆయన ఇచ్చిన సమాధానాలపై సీబీఐ సంతృప్తి చెందక పోవడంతో బ్యూరోక్రాట్ స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, ఈ రోజు ఉదయం సిసోడియా సీబీఐ ఆఫీసుకు వెళ్లక ముందు రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధిని సందర్శించారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. ఈ రోజు మళ్లీ సీబీఐ ఆఫీసుకు వెళ్తాను. అక్కడ వారి విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు నా వెంట ఉన్నాయి.. కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా తాను పట్టించుకోవడం లేదని ఉద్వేగంగా మాట్లాడారు.

దేశం కోసం భగత్ సింగ్ ఉరితీయ బడ్డాడు. నేను భగత్ సింగ్ అభిమానిని.. నేను జైలుకు వెళ్లేది కొన్ని తప్పుడు ఆరోపణల వల్లనే.. ఇది చాలా చిన్న విషయం అని అన్నారు. ఈ రోజు జైలుకు వెళ్తే నా భార్య ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మీరే ఆమె, కుటుంబం బాగోగులు చూసుకోవాలని చెప్పారు. ఇదే వీడియోను మనీశ్ సిసోడియా ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు. కాగా, సిసోడియా ట్వీట్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రిప్లై ఇచ్చారు. మీ కుటుంబాన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాము. మీరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

మనీశ్ సిసోడియా అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది. సిసోడియా అరెస్టు నియంతృత్వపు చర్య అని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఒక ఉత్తమ విద్యా శాఖ మంత్రిని అరెస్టు చేయడం భావ్యం కాదని అన్నారు. ప్రధాని మోడీ అరాచకపు పోకడలు ఏదో ఒక రోజు అంతం కాక తప్పదని ఆయన చెప్పారు.


First Published:  26 Feb 2023 2:36 PM GMT
Next Story