Telugu Global
National

అల్లర్లు అదుపు చేయలేరు కానీ, విపక్షాలపై విసుర్లు..

ప్రతిపక్షాల నోళ్లు మూయించడంపై పెట్టిన శ్రద్ధ, మణిపూర్ లో శాంతి భద్రతల పునరుద్ధరణపై పెడితే బాగుండేదని బీజేపీపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అల్లర్లు అదుపు చేయలేరు కానీ, విపక్షాలపై విసుర్లు..
X

మణిపూర్ అల్లర్ల వ్యవహారంలో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా మారింది కేంద్రం పరిస్థితి. మణిపూర్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కేంద్రం తీరు మరోలా ఉండేది. కానీ అక్కడ కూడా బీజేపీదే పెత్తనం. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నమాట. అందుకే మణిపూర్ అల్లర్లు కేంద్రానికి డబుల్ డ్యామేజీగా మారాయి. జరిగిందేదో జరిగిపోయింది. అల్లర్లకు కారణం స్థానిక బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న రిజర్వేషన్ ల నిర్ణయం అని అందరికీ తెలుసు. పోనీ ఇప్పుడేం చేయాలో మణిపూర్ ప్రభుత్వానికి ఓ అవగాహన ఉండాలి కదా. లేకపోతే కనీసం కేంద్రం సాయంతో అయినా అల్లర్లను అదుపు చేసే ఉపాయం ఆలోచించాలి కదా. ఆ రెండూ జరగలేదు. అందుకే మణిపూర్ ఇంకా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. అయితే నింద ప్రతిపక్షాలపై వేసి కేంద్రం తప్పించుకోవాలనుకోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్.

మణిపూర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మణిపూర్ అంశంపై విపక్షాలది మొసలి కన్నీరని ఎద్దేవా చేశారామె. చర్చకు రమ్మంటే విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. చర్చలో పాల్గొనేందుకు విపక్ష నేతలకు ఇష్టం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే విమర్శలు చేస్తున్నారని అన్నారు.


267 వర్సెస్ 176

267వ నిబంధన ప్రకారం ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే రూల్ 176 ప్రకారం మణిపూర్ సమస్యపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని, చర్చను ప్రారంభించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ కర్ పేర్కొన్నారు. రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అయితే తాను రూల్ 267 కింద నోటీసులను అంగీకరించలేదని.. వాటిని తిరస్కరించానని చెప్పారు చైర్మన్. ఈ క్రమంలోనే సభలో గందరగోళం కొనసాగి వాయిదా పడింది.

మోదీ నోరు పెగలదా..?

మోదీ సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. ఆయన నోరు మెదపకపోవడం విశేషం. కనీసం ప్రతిపక్షాలు కోరిన రీతిలో చర్చకు కూడా అధికార పార్టీ సిద్ధంగా లేదు. పైగా ప్రతిపక్షాలవి మొసలి కన్నీళ్లంటూ కేంద్ర మంత్రి నిర్మలమ్మ కౌంటర్లు మరింత అగ్గి రాజేస్తున్నాయి. ప్రతిపక్షాల నోళ్లు మూయించడంపై పెట్టిన శ్రద్ధ, మణిపూర్ లో శాంతి భద్రతల పునరుద్ధరణపై పెడితే బాగుండేదని బీజేపీపై నెటిజన్లు మండిపడుతున్నారు.

First Published:  31 July 2023 4:26 PM GMT
Next Story