Telugu Global
National

బీఆర్ఎస్ విస్తరణలో మరో కీలక నిర్ణయం.. మహారాష్ట్రలో మాణిక్ కదమ్‌కు బాధ్యతలు

మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో మరింత ఉత్సాహంగా పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ నడుం భిగించారు.

బీఆర్ఎస్ విస్తరణలో మరో కీలక నిర్ణయం.. మహారాష్ట్రలో మాణిక్ కదమ్‌కు బాధ్యతలు
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారు. తొలుత తెలంగాణకు దగ్గరలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో మరింత ఉత్సాహంగా పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ నడుం భిగించారు.

'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతోనే బీఆర్ఎస్ పుట్టింది. అందుకే ముందుగా పలు రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌లు ప్రారంభించి.. కొంత మందికి బాధ్యతలు అప్పగించారు. ముందుగా భారత రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్‌కేఎస్)లను బలోపేతం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు సంబంధించిన కిసాన్ సమితి బాధ్యతలను మాణిక్ కదమ్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణలో కిసాన్ సమితి కీలక పాత్ర పోషించనున్నది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో రైతులకు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను వివరించేందుకు.. భవిష్యత్‌లో బీఆర్ఎస్ అందించబోయే స్కీమ్‌లను తెలియజేయడానికి కిసాన్ సమితి కృషి చేస్తోంది.

తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంది ఆదరణ లభిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రెండు పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉన్నది. అందుకే ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ పథకాలపై అవగాహన కల్పించే బాధ్యతను కిసాన్ సమితికే అప్పగించారు. ఇప్పటికే కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడిగా గుర్నామ్‌సింగ్ చడూనీని నియమించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర విభాగానికి మాణిక్ కదమ్‌కు బాధ్యతలు అప్పగించారు.

మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి బాధ్యతలను తనకు అప్పగించడంపై మాణిక్ కదమ్ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ రైతునైన తనకు కిసాన్ విభాగం అధ్యక్షుడిని చేయడంపై కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రైతులకు అండగా ఉండేందుకు, అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని మరువలేమని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతీ ఒక్కరు మద్దతు పలకాలని..మాణిక్ కదమ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


First Published:  26 Feb 2023 12:13 PM GMT
Next Story