Telugu Global
National

పంది పిల్లల పెంపకం పేరుతో 500 కోట్లు కాజేసిన కేటుగాడు

విదేశాల్లో పంది మాంసానికి బాగా డిమాండ్ ఉందని, దీనికోసం తాను ఇచ్చే మేలురకం జాతికి చెందిన పంది పిల్లల్ని కొనాల్సి ఉంటుందని చెప్పేవాడు. 3 పంది పిల్లల్ని 10వేల రూపాయలకు అంటగట్టేవాడు.

పంది పిల్లల పెంపకం పేరుతో 500 కోట్లు కాజేసిన కేటుగాడు
X

మా సంస్థలో ఒకసారి పెట్టుబడి పెడితే నెలవారీ జీతంలాగా లాభం సంపాదించొచ్చు అనే మోసం ఇప్పుడు బాగా పాతదైపోయింది. మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఊరికే పెట్టుబడి అంటే ఎవరూ ముందుకు రారు కాబట్టి, తెలివిగా పంది పిల్లల పెంపకం అనే మాయమాటలు చెప్పారు. విదేశాల్లో పంది మాంసానికి బాగా డిమాండ్ ఉందని చెప్పి 5 రాష్ట్రాల్లో ఏకంగా 500 కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు.

అప్పట్లో ఈము కోళ్లు..

ఆమధ్య ఈము కోళ్ల పెంపకం అంటూ మోసగాళ్లు రైతుల్ని బుట్టలో వేసుకుని కుచ్చుటోపీ పెట్టారు. ఈము మాంసానికి మ‌స్తు డిమాండ్ ఉంటుందని చెప్పారు. కానీ, ఆ కోళ్లు కొన్న రైతులు వాటిని మేపలేక, వాటి మాంసాన్ని అమ్ముకోలేక అవస్థలు పడ్డారు. ఇప్పుడు సరిగ్గా పందిపిల్లల పేరుతో ఇలాంటి మోసమే జరిగింది. అసలు పందుల పెంపకంతో సంబంధంలేని వారంతా మోసగాడి మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్నారు.

పంజాబ్ కేటుగాడు..

పంజాబ్‌ లోని ఫిరోజ్‌ పూర్‌ కు చెందిన మంగత్‌ రాం మైనీ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. విదేశాల్లో పంది మాంసానికి బాగా డిమాండ్ ఉందని, దీనికోసం తాను ఇచ్చే మేలురకం జాతికి చెందిన పంది పిల్లల్ని కొనాల్సి ఉంటుందని చెప్పేవాడు. 3 పంది పిల్లల్ని 10వేల రూపాయలకు అంటగట్టేవాడు. ఏడు నెలల్లోనే రూ.40,000 ప్రతిఫలం వస్తుందన్నాడు. ఏడు నెలల తర్వాత ఏకమొత్తంగా 15వేలు ఇచ్చి, మిగతా 25వేలను వారానికి 500 రూపాయల చొప్పున 30వారాలు చెల్లిస్తానన్నాడు. ఈ పథకానికి ఆకర్షితులై చాలామంది 10వేలు పెట్టుబడి పెట్టారు. మరికొందరు అత్యుత్సాహంతో 2కోట్ల వరకు డబ్బులిచ్చి పంది పిల్లల్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత మంగత్ రాం మొహం చాటేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

నమ్మకం కలిగించేలా కొంతమందికి ఏడు వారాల తర్వాత 15వేల రూపాయలు ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా వారానికోసారి వస్తాయి కదా అని వారంతా ఆ 15వేలను కూడా తిరిగి పెట్టుబడిగా పెట్టేశారు. వారిని చూసి మరికొందరు మోసపోయారు. భారత రక్షణరంగానికి చెందిన ఓ ఉద్యోగి 25 లక్షల రూపాయలు ఇలా పోగొట్టుకున్నాడు. ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పందిపిల్లల బాధితులున్నారు.

First Published:  21 Nov 2022 4:31 AM GMT
Next Story