Telugu Global
National

మాండూస్ ఎఫెక్ట్ : భారీ వర్షానికి చెన్నై చిన్నాభిన్నం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు, పురాతన ఇళ్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

మాండూస్ ఎఫెక్ట్ : భారీ వర్షానికి చెన్నై చిన్నాభిన్నం
X

మాండూస్ తుపాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైతోపాటు కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తంజావూరు, పుదుకొట్టై, తిరువారూరు. కాంచీపురం, చెంగల్పట్టు, శివగంగై, రామనాథపురం, తిరుచ్చి, కళ్లకురిచ్చి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైని భారీ వర్షం చిన్నాభిన్నం చేసింది. నగరవ్యాప్తంగా 200కు పైగా వృక్షాలు నేలకొరిగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు, పురాతన ఇళ్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వర్షం వల్ల విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.

తిరుపతి, తిరుమలపై మాండూస్ తుపాన్ ఎఫెక్ట్..

మాండూస్ తుపాన్ ప్రభావం కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి నగరాన్ని తుపాన్ ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో అధికార బృందం సహాయక చర్యలు చేపట్టింది.

రెండేళ్ల కిందట నివర్ తుపాన్ సమయంలో రైల్వేకోడూరు -తిరుపతి రోడ్డు భారీ ప్రవాహంతో నదిని తలపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే రోడ్డులో బాలయ్య పల్లె వద్ద నుంచి రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది. ఇక తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఏఎన్ సీ ప్రాంతంలో ఓ భారీ వృక్షం విరిగిపడి ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంలో భక్తులు రాకపోకలు సాగించకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇక తిరుమల ఘాట్ రోడ్ లోని మాల్వాడి గుండం, కపిల తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

First Published:  10 Dec 2022 4:10 PM GMT
Next Story