Telugu Global
National

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు.. మమతా బెనర్జీ ఫైర్

బీజేపీ నాయకుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని హెచ్చ‌రించారు. ఆ పార్టీకి 200 సీట్లు కూడా మించవని ఆమె తేల్చి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు.. మమతా బెనర్జీ ఫైర్
X

2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. టీఎంసీకి జాతీయ హోదా తొలగించడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు వారు కోరుకున్నవన్నీ చేసుకుంటున్నారన్నారు. అయితే అధికారం శాశ్వతం కాదని, తాత్కాలికమేనన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

అధికారం వస్తుంటుంది.. పోతుంటుందని.. కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. రాజ్యాంగం కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుందని, దానిని ఎవరూ నాశనం చేయలేరని దీదీ చెప్పారు. బీజేపీ నాయకుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని హెచ్చ‌రించారు. ఆ పార్టీకి 200 సీట్లు కూడా మించవని ఆమె తేల్చి చెప్పారు.

ఈసీ తీరుపై మమతా ఫైర్

ఇటీవల ఈసీ జాతీయ పార్టీ హోదా ఉన్న పలు పార్టీలకు ఆ హోదా తొలగించిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాతీయ హోదాను కూడా ఈసీ తొలగించింది. దీనిపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందని, బీజేపీ నాయకులు కావాలనే తమ పార్టీకి ఉన్న జాతీయ హోదాను తొలగించారని ఆమె మండిపడ్డారు.

సొంత రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కొంతమేర బలం ఉన్న పార్టీలకు జాతీయ పార్టీ హోదా ఇవ్వాలని మమతా బెనర్జీ ఈసీని కోరారు. తమ పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ గా ఉంటుందని పేర్కొన్నారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కోసం తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇవి నిజం కాదని మమతా స్ప‌ష్టం చేశారు. తాను అమిత్ షాను కలిసినట్టు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమె సవాల్ విసిరారు.

First Published:  19 April 2023 3:55 PM GMT
Next Story