Telugu Global
National

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణం - మమతా బెనర్జీ

విపక్ష 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాల ఒప్పందం లేకపోవడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణం - మమతా బెనర్జీ
X

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా వెల్లడించారు. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడంతోనే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇవాళ ఆమె పశ్చిమ బెంగాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. విపక్ష 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాల ఒప్పందం లేకపోవడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

ఇది కాంగ్రెస్ ఓటమి మాత్రమే అని, ప్రజలది కాదని ఆమె అన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్లే బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు భావజాలంతో పాటు వ్యూహం కూడా అవసరం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు 'ఇండియా' కూటమిలోని పార్టీలన్నీ కలసి పనిచేసి తప్పులను సరిదిద్దుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.

కూటమిలోని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే 2024లో బీజేపీ అధికారంలోకి రాదని మమత చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడంపై ఇదివరకే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. సీట్ల పంపకంపై చర్చలు జరపకుండానే కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిందని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ ఓటమిపై జేడీయూ నేత కేసీ త్యాగి కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ కూటమిలోని ఇతర పార్టీలను పట్టించుకోకపోవడం వల్లే ఓటమి చెందిందని చెప్పారు.


First Published:  4 Dec 2023 3:00 PM GMT
Next Story