Telugu Global
National

మహువా మొయిత్రా వివాదంపై మౌనం వీడిన మమతా

మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

మహువా మొయిత్రా వివాదంపై మౌనం వీడిన మమతా
X

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం, బహుమతులు తీసుకున్నారన్న అభియోగాలను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొద్దిరోజుల కిందట పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారణ కూడా నిర్వహించింది. మొయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చినట్లు తేలడంతో ఆమె ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది.

అయితే ఈ వివాదం కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ దీనిపై టీఎంసీ పార్టీ కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ ఒక్కసారి కూడా స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడారు. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయని ఆమె వ్యాఖ్యానించారు.

గురువారం కోల్‌కతాలో కార్యకర్తలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మొయిత్రా వ్యవహారంపై తొలిసారి స్పందించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నకేంద్ర సంస్థలు 2024 ఎన్నికల తర్వాత బీజేపీతోనే వెళ్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండేది మరో మూడు నెలలే అని అన్నారు. బీజేపీ తమ పార్టీకి చెందిన నేతలపై వివిధ కేసులను పెట్టి అరెస్టు చేస్తోందని విమర్శించారు.

ఎంపీ మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒకవేళ ఆమెను బహిష్కరిస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆమెకు సహాయం చేస్తుందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.

అదానీ గ్రూప్, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా ప్రముఖ వ్యాపారవేత్త హీరానందానీ నుంచి రెండు కోట్ల లంచం, బహుమతులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. ఈ విషయమై విచారణ చేపట్టాలని ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. స్పీకర్ ఫిర్యాదుతో లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ దీనిపై విచారణ జరిపింది.


First Published:  23 Nov 2023 2:30 PM GMT
Next Story