Telugu Global
National

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా దీదీ..! నితీష్‌తో కాంపిటీషన్ ఉంటుందనేనా..?

కాబోయే ప్రధాని నితీష్ అంటూ అప్పుడే కొత్త నినాదాలు మొదలయ్యాయి. తాను ప్రధాని రేసులో లేను అంటూ సున్నితంగా తిరస్కరించినా, నితీష్ నెక్స్ట్ టార్గెట్ అదేననే అనుమానం చాలామందిలో ఉంది. అందులో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒకరు. అందుకే ఆమె వైపు నుంచి ఓ ముందడుగు పడింది.

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా దీదీ..! నితీష్‌తో కాంపిటీషన్ ఉంటుందనేనా..?
X

ఎన్డీఏకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాటం చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. కానీ దానికి నాయకత్వం ఎవరు వహిస్తారనే విషయంలోనే పీటముడి పడింది. కాంగ్రెస్ నాయకత్వం చాలా పార్టీలకు ఇష్టంలేదు. కాంగ్రెసేతర పార్టీలు ఏకమైనా ఎన్డీఏని ఎదుర్కోవడం కష్టం. దీంతో ఎప్పటికప్పుడు కూటమిపై మాటలు మాత్రమే జరుగుతున్నాయి కానీ చేతల్లోకి వెళ్లడంలేదు. తాజాగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా విపక్షాల అనైక్యత బట్టబయలైంది. అయితే ఎన్డీఏపై ఎదురుదాడి అనే విషయంలో ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామాలు అందరికీ ఊపిరినిచ్చాయి. ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన నితీష్ కుమార్ ఆర్జేడీతో కూటమి కట్టి తిరిగి సీఎం పీఠం అధిష్టించారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు బీజేపీకే కాదు, విపక్షాలకు కూడా సాధ్యమేనని నిరూపించారు. ఈ దశలో నితీష్ ని అపర చాణుక్యుడిగా అభివర్ణిస్తూ దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాబోయే ప్రధాని నితీష్ అంటూ అప్పుడే కొత్త నినాదాలు మొదలయ్యాయి. తాను ప్రధాని రేసులో లేను అంటూ సున్నితంగా తిరస్కరించినా, నితీష్ నెక్స్ట్ టార్గెట్ అదేననే అనుమానం చాలామందిలో ఉంది. అందులో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒకరు. అందుకే ఆమె వైపు నుంచి ఓ ముందడుగు పడింది.

2024 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించేందుకు విప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని టీఎంసీ ఎంపీ సౌగ‌త్ రాయ్ తాజాగా పేర్కొన్నారు. ప్రధాని పీఠానికి విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా మ‌మ‌తా బెన‌ర్జీని ముందుకు తీసుకొస్తామని చెప్పారాయన. రాబోయే రెండేండ్ల‌లో విప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు టీఎంసీ నేత‌లు ప‌నిచేస్తార‌ని కూడా అన్నారు. అంతే కాదు, దేశంలో మ‌మ‌తా బెన‌ర్జీకి మంచి ఇమేజ్‌ ఉందని, త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆమెను ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా కోరుకుంటున్నార‌ని తెలిపారు.

సడన్ గా ఎందుకీ సంప్రదింపులు..

2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పోటీ చేసి, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని గతంలో అనుకున్నాయి. కానీ విపక్షాలలో ఒకరంటే ఒకరికి పొసగడంలేదు. ఎవరికి వారే ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీలను బలోపేతం చేసుకోడానికి కృషి చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీతోపాటు పంజాబ్ లోనూ జెండా పాతారు. అటు టీఎంసీ కూడా గోవా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది, ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ కోసం ఆలోచనలు చేస్తున్నారు. ఈ దశలో ఎన్నికలకు ముందే విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అంటే అది కష్టసాధ్యమే. అయితే ఆ సమయానికి ఎవరి ఇమేజ్ ఎంత అనే ప్రస్తావన కూడా వస్తుంది. ప్రస్తుతానికి మోదీని ఎదిరించిన మొనగాడిగా నితీష్ పేరు మారుమోగిపోతోంది. అందుకే దీదీ సడన్ ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ మాటల్లో అంతరార్థం ముందు జాగ్రత్తేనని చెబుతున్నారు. మరి ఈ ప్రతిపాదనను మిగతా పార్టీలు స్వాగతిస్తాయా, వ్యతిరేకిస్తాయా.. అనేది తేలాల్సి ఉంది.

First Published:  13 Aug 2022 3:14 AM GMT
Next Story