Telugu Global
National

బెంగాల్‌లో 42 స్థానాలకూ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన మమత

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు.

బెంగాల్‌లో 42 స్థానాలకూ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన మమత
X

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మొత్తం 42 ఎంపీ స్థానాలకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం కోల్‌కత్తాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దీదీ రాష్ట్రంలోని మొత్తం 42 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మమతా బెనర్జీ పార్టీ విపక్ష 'ఇండియా కూటమి'లో ఉన్న సంగతి తెలిసిందే. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుగా టీఎంసీ భావించింది. మొత్తం 42 స్థానాల్లో కొన్నింటిని కాంగ్రెస్ కు కేటాయించాలని కొద్ది రోజుల కిందట మమత నిర్ణయించారు.

అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. విపక్ష ఇండియా కూటమిలో కొనసాగుతూనే ఒంటరిగా బరిలోకి దిగేందుకు టీఎంసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కత్తాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం 42 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్

టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఎంపీగా పోటీ చేసేందుకు మమతా బెనర్జీ అవకాశం కల్పించారు. బహరంపూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్‌పై యూసుఫ్ పోటీ చేయనున్నారు. అవినీతి ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రాకు మరోసారి కృష్ణానగర్ నుంచి మమతా అవకాశం కల్పించారు.

బర్ధమాన్ - దుర్గాపూర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ కీర్తి ఝా ఆజాద్ కు కేటాయించారు. ఈసారి ఏకంగా 8 మంది సిట్టింగ్ లను మమతా బెనర్జీ పక్కన‌పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక స్థానంలో పోటీ చేసేందుకుగాను మమతా బెనర్జీ సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరుపుతున్నారు. అలాగే అస్సాం, మేఘాలయలో కూడా టీఎంసీ పోటీ చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.

First Published:  10 March 2024 11:53 AM GMT
Next Story