Telugu Global
National

మల్లిఖార్జున్ ఖర్గే రబ్బర్ స్టాంపే.. చెప్పిందెవరో తెలుసా?

గాంధీ ఫ్యామిలీకి ఖర్గే రబ్బర్ స్టాంప్‌లా పని చేస్తారా అని అడగ్గా.. 60 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. 40 శాతం మంది కాదని అన్నారు.

మల్లిఖార్జున్ ఖర్గే రబ్బర్ స్టాంపే.. చెప్పిందెవరో తెలుసా?
X

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరనే చర్చ జరుగుతోంది. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ ఫ్యామిలీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటోంది. సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీ శశిథరూర్ ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. మల్లిఖార్జున్ ఖర్గేను అధ్యక్షుడిని చేయాలని గాంధీ ఫ్యామిలీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు అతడు అధ్యక్షుడు అయితే కచ్చితంగా గాంధీ ఫ్యామిలీకి రబ్బర్ స్టాంప్‌లా వ్యవహరిస్తారని బీజేపీ విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలను ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఖండించారు.

రాజకీయ పార్టీల గోల ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రజల్లో ఏమైనా చర్చ జరుగుతోందా? వాళ్లు ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుందని అనుకుంటున్నారనే విషయాలపై ఓ మీడియా సంస్థతో కలిసి సీ-ఓటర్ సర్వే నిర్వహించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ క్విక్ సర్వేలో 5,291 శాంపిల్స్ తీసుకున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా అత్యధిక మంది గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పారు. 37 శాతం మంది గాంధీ కుటుంబ వ్యక్తికి, 35 శాతం మంది మల్లిఖార్జున్ ఖర్గేకు, 28 శాతం మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటేశారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తమకు అభ్యంతరం లేదని అత్యధిక మంది అభిప్రాయపడటం విశేషం.

ఇక మల్లిఖార్జున్ ఖర్గే గురించి కూడా ప్రశ్నించగా షాకింగ్ అభిప్రాయాలు వెల్లడించారు. గాంధీ ఫ్యామిలీకి ఖర్గే రబ్బర్ స్టాంప్‌లా పని చేస్తారా అని అడగ్గా.. 60 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. 40 శాతం మంది కాదని అన్నారు. బీజేపీ విమర్శించడమే కాకుండా ప్రజలు కూడా ఖర్గే ఓ రబ్బర్ స్టాంప్‌లా పని చేస్తారని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఈ నెల 17న జరుగనున్నది. 19న ఫలితాలు వెల్లడిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

First Published:  9 Oct 2022 1:00 AM GMT
Next Story