Telugu Global
National

రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా

రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడి పదవికి మల్లికార్జున్ ఖర్గే రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే ఉదయ్ పూర్ తీర్మానాన్ని అనుసరించి ఆయన‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా
X

కాంగ్రెస్ పార్టీలో ఉదయ్ పూర్ తీర్మానం ఈ మధ్య సృష్టించిన గందరగోళం తెలిసిందే. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే ఉదయ్ పూర్ తీర్మానాన్ని ధిక్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరుగుబాటు చేయడం, అతి కష్టం మీద అది సద్దుమణిగిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అందరినీ ఆకట్టుకునే పని చేశారు.

ప్రస్తుతం ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు. ఇప్పుడు పార్టీ అధ్యక్షపదవికి పోటీ పడుతున్నారు. ఇంకా ఎన్నికలు కాలేదు. ఆయన గెలవలేదు. ఎవరు గెలుస్తారో ముందే చెప్పలేం కూడా అయినప్పటికీ ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగానే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నందువల్ల రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు.

అయితే మల్లికార్జున్ ఖర్గే నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే ఉదయ్ పూర్ తీర్మానానికి కట్టుబడ్డ ఆయన తీరుకు కార్యకర్తలు, నాయకులు ఫిదా అయిపోతున్నారు.

కాగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడెవరన్నది తేల్చే అవకాశం ఉంది.

First Published:  1 Oct 2022 12:06 PM GMT
Next Story