Telugu Global
National

మహా రాజకీయం.. బీజేపీ కూటమిలో షిండే బాంబ్

అజిత్ పవార్ తన వర్గంతో బీజేపీకి దగ్గరవుతారనే వార్తలొస్తున్నాయి. అవన్నీ వట్టి పుకార్లేనని అజిత్ పవార్ కొట్టిపారేసినా ఏక్ నాథ్ షిండేలో భయం మొదలైంది.

మహా రాజకీయం.. బీజేపీ కూటమిలో షిండే బాంబ్
X

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని కూలదోసి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే.. ఇప్పుడు కమలనాథులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో కూడా బీజేపీ చాలా వరకు ఏక్ నాథ్ వర్గానికి తలొంచింది. ఫడ్నవీస్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కీలక పదవులన్నీ ఏక్ నాథ్ వర్గమే తీసుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా అజిత్ పవార్ వర్గం బీజేపీకి దగ్గరవుతుందన్న వార్తల నేపథ్యంలో ఏక్ నాథ్ పట్టు బిగించారు. అజిత్ పవార్ తో బీజేపీ స్నేహం చేస్తే తన దారి తాను చూసుకుంటానన్నారు. ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోతామని పార్టీ అధికార ప్రతినిధి ద్వారా చెప్పించారు..

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర సీఎం కుర్చీపై ఇప్పటి వరకు ముగ్గురు ఆసీనులయ్యారు. సొంతగా మెజార్టీ లేదని తెలిసినా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వర్గాన్ని దగ్గరకు తీసి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు రోజులకే అజిత్ పవార్ రూటు మార్చి ఎన్సీపీలోకి తిరిగి వచ్చేయడంతో ఫడ్నవీస్ కి సీఎం సీటు చేజారింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ సపోర్ట్ తో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఉద్ధవ్ థాక్రే సీఎం అయ్యారు. ఈసారి శివసేనలో వేరు కుంపటి పెట్టారు ఏక్ నాథ్ షిండే. పార్టీని నిట్ట నిలువునా చీల్చేశారు. షిండే సేన బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాపురం సజావుగా సాగిపోతోందనుకుంటున్న వేళ.. వచ్చే ఏడాది ఎన్నికలు మళ్లీ మహారాష్ట్రలో చిచ్చుపెట్టాయి. అజిత్ పవార్ తన వర్గంతో బీజేపీకి దగ్గరవుతారనే వార్తలొచ్చాయి. అవన్నీ వట్టి పుకార్లేనని అజిత్ పవార్ కొట్టిపారేసినా ఏక్ నాథ్ షిండేలో భయం మొదలైంది.

గతంలో అజిత్ పవార్, ఫడ్నవీస్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వారిద్దరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూడా. అయితే శరద్ పవార్ వ్యూహం ముందు ఆ కూటమి నిలబడలేదు. అజిత్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కానీ వచ్చే ఏడాది ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడంలేదు. అందుకే అజిత్ పవార్ మళ్లీ ఫడ్నవీస్ కి దగ్గరవుతారని అంటున్నారు. దీంతో షిండే వర్గం భయపడుతోంది. 2024 ఎన్నికల్లో షిండే సేనను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారనేది తెలియదు. అసలు శివసేన తమదేనంటూ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు తెచ్చుకున్నా,వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని షిండే భయపడుతున్నారు. ఈలోగా బీజేపీ, అజిత్ పవార్ ని దగ్గరకు తీస్తే అది తనకు మంచిది కాదని భావిస్తున్నారు. అందుకే ముందుగా బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అజిత్ పవార్ ని బీజేపీ దగ్గరకు తీస్తే, తన వర్గం ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోతుందని షాకిచ్చారు.

First Published:  20 April 2023 1:31 AM GMT
Next Story