Telugu Global
National

హోం, ఫైనాన్స్.. కీలక శాఖలు ఫడ్నవీస్‌కే.. సీఎం కుర్చీ మాత్రమే షిండేకి..

గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఒకే వ్యక్తి డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక మంత్రిగా వ్యవహరించలేదు. తొలిసారిగా ఆ అరుదైన ఫీట్ సాధించారు దేవేంద్ర ఫడ్నవీస్.

హోం, ఫైనాన్స్.. కీలక శాఖలు ఫడ్నవీస్‌కే.. సీఎం కుర్చీ మాత్రమే షిండేకి..
X

మహారాష్ట్రకు ఏక్ నాథ్ షిండే కేవలం ముఖ్యమంత్రి కానీ, అనధికారిక సీఎం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని మరోసారి రుజువైంది. మెజార్టీ సీట్లు బీజేపీకి ఉన్నా.. కేవలం అధికారం కోసమే సీఎం కుర్చీ శివసేన చీలిక వర్గానికి కేటాయించింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ని డిప్యూటీ సీఎంగా నియమించి అక్కడ పెత్తనం చెలాయిస్తోంది. తాజాగా మంత్రి వర్గ శాఖల కేటాయింపులో కూడా ఫడ్నవీస్ తెలివిగా వ్యవహరించారు. కీలక హోం, ఆర్థిక శాఖలు రెండూ తన వద్దే ఉంచుకున్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఒకే వ్యక్తి డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక మంత్రిగా వ్యవహరించలేదు. తొలిసారిగా ఆ అరుదైన ఫీట్ సాధించారు దేవేంద్ర ఫడ్నవీస్.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 రోజుల పాటు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరే అన్ని శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత 18 మందిని చేర్చుకుని మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. సీఎం ఏక్ నాథ్ షిండే పట్టణాభివృద్ధి, రవాణా, పర్యావరణం, మైనారిటీ, విపత్తు నిర్వహణ శాఖలను తన వద్ద ఉంచుకున్నారు. బీజేపీకి చెందిన మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు రెవెన్యూ శాఖ కేటాయించారు. బీజేపీకే చెందిన సుధీర్ ముంగంటివార్‌కు అటవీ శాఖ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

షిండే వర్గం నుంచి దీపక్ కేసర్కర్‌కు పాఠశాల విద్యా శాఖ దక్కింది. అబ్దుల్ సత్తార్‌కు వ్యవసాయ శాఖ కేటాయించారు. కేబినెట్‌లో గరిష్టంగా 43 మందికి అవకాశమున్నా.. ముందు జాగ్రత్తగా కేవలం 18 మందితోనే చిన్న కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు షిండే. ముందు ముందు అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయా స్థానాలను ఖాళీగా వదిలిపెట్టారు. జంబో కేబినెట్‌తో తిప్పలు తప్పవనే ఈ నిర్ణయం తీసుకున్నారు షిండే, ఫడ్నవీస్. కీలక శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. షిండే వర్గానికి సీఎం సీటుతోపాటు మిగతా శాఖలు దక్కాయి.

First Published:  14 Aug 2022 2:07 PM GMT
Next Story