Telugu Global
National

దేశంలో రైతుల తుపాన్ -నాందేడ్ సభలో కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో కూడా రిజిస్టర్‌ చేయించామని చెప్పిన కేసీఆర్‌, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, ప్రతి జిల్లా పరిషత్‌ పై గులాబీ జెండా ఎగరాలన్నారు.

దేశంలో రైతుల తుపాన్ -నాందేడ్ సభలో కేసీఆర్
X

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ వస్తుందని, దాన్నెవరూ ఆపలేరని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో దేశంలో రైతు రాజ్యం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, రైతు బీమాతోపాటు, పంట కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకున్నదని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఇంకే రాష్ట్రంలోనూ లేదని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అలాంటి పథకాలు అమలు చేయనంత వరకు తాను అక్కడికి వస్తూనే ఉంటానని చెప్పారు కేసీఆర్.


బీఆర్ఎస్ లో చేరికలు..

ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌ రావు దోండే సహా పలువు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్ లోకి కేసీఆర్‌ ఆహ్వానించారు. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో లాగా, మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు కేసీఆర్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా పేదల బతుకులు మారలేదన్నారు.

దొందూ దొందే..

కాంగ్రెస్‌ 54 ఏళ్లు, బీజేపీ 14 ఏళ్లపాటు దేశాన్ని పాలించి ఏం చేశాయని ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయని, అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉందని చెప్పారు. ప్రతి ఏటా 40 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందన్నారు. మహారాష్ట్ర కృష్ణా, గోదావరి నదులకు జన్మస్థానం అయినా కూడా, ఇక్కడి రైతులకు మేలు జరగడంలేదన్నారు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, వాటితో 24 గంటల విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చన్నారు.

గతంలో నాందేడ్‌ లో సభ పెట్టగానే మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేసిందని, దీంతో బీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రజలకు అర్థమైందని కేసీఆర్‌ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో కూడా రిజిస్టర్‌ చేయించామని చెప్పిన కేసీఆర్‌, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, ప్రతి జిల్లా పరిషత్‌ పై గులాబీ జెండా ఎగరాలన్నారు.

First Published:  26 March 2023 12:48 PM GMT
Next Story