Telugu Global
National

ముఖ్య‌మంత్రికే పార్టీ టికెట్ లేదు

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా రాక‌ముందే ఛ‌త్తీస్‌గ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు బీజేపీ ఫ‌స్ట్ లిస్ట్ ప్ర‌క‌టించేసింది.

ముఖ్య‌మంత్రికే పార్టీ టికెట్ లేదు
X

2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు బీజేపీ తొలి అడుగు వేసేసింది. ఛ‌త్తీస్‌గ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, తెలంగాణ, మిజోరంల‌కు ఈ ఏడాది చివ‌రిలోగా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా రాక‌ముందే ఛ‌త్తీస్‌గ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు బీజేపీ ఫ‌స్ట్ లిస్ట్ ప్ర‌క‌టించేసింది. త‌ద్వారా ఎన్నిక‌ల పోటీలో తానే ముందున్నాన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసింది.

బీజేపీ చ‌రిత్ర‌లో తొలిసారి..

90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గ‌డ్‌లో 21 సీట్ల‌కు, 230 అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా ప్ర‌క‌టించ‌కముందే బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే తొలిసారి అని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీ ముగిసిన మ‌ర్నాడే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఫ‌స్ట్ లిస్ట్ ప్ర‌క‌టించ‌డం ఆ పార్టీ స‌న్న‌ద్ధ‌త‌ను చాటుతోంది.

వాళ్ల పేర్లు ఎందుకు లేవు?

మ‌ధ్య‌ప్ర‌దేశ్ తొలి జాబితాలో సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌తోపాటు ప్ర‌ధాన‌మైన మంత్రుల పేర్లు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే ప్ర‌ధానంగా సీట్ల విష‌యంలో బాగా పోటీ ఉండి, ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నుకున్న చోట్ల ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించామ‌ని, స‌ర్దుబాట్లు ఏమైనా ఉంటే చేసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతోనే ఇంత ముందు ప్ర‌క‌టించామ‌ని బీజేపీ చెబుతోంది.

First Published:  18 Aug 2023 5:23 AM GMT
Next Story