Telugu Global
National

ఎన్నికల వేళ బీజేపీ సీఎం సర్కస్ ఫీట్లు

భోపాల్‌ లోని జంబోరీ మైదాన్‌ లో జరిగిన మహిళల సమావేశంలో మోకాళ్లపై కూర్చుని మరీ ‘‘నమస్కార్‌.. ప్రణామ్‌.. మీరే నాకు దుర్గ, లక్ష్మి, సరస్వతి’’ అంటూ వంగి వంగి దండాలు పెట్టారు ముఖ్యమంత్రి.

ఎన్నికల వేళ బీజేపీ సీఎం సర్కస్ ఫీట్లు
X

ఎన్నికలొస్తున్నాయంటే బీజేపీ నేతలు ఎలాంటి హామీలు గుప్పిస్తారో అందరికీ తెలుసు. అలాంటిది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరో అడుగు ముందుకేశారు. హామీలిచ్చే క్రమంలో ఆయన సర్కస్ ఫీట్లు కూడా చేశారు. బహిరంగ సభా వేదికపై మోకాళ్లపై కూర్చుని ఆయన మహిళకు నమస్కారం చేశారు. మోకాళ్లపై కూర్చునే ‘ముఖ్యమంత్రి లాడ్లీ బెహన్‌ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అదే పొజిషన్లో ఉండి ఓ దరఖాస్తు కూడా నింపారు. ఇక చాలు లేవండి మహాప్రభో అంటూ చుట్టూ ఉన్న నేతలు మనసులో అనుకున్నా.. ఆయన విన్యాసాలు మాత్రం ఆగలేదు.

కుట్ర రాజకీయాలతో మధ్యప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ, ఈ ఏడాది అక్కడ అసలు సిసలు పరీక్ష ఎదుర్కోబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని తేలిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన ‘ముఖ్యమంత్రి లాడ్లీ బెహన్‌ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ప్రకటించారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 65వ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించారు. భోపాల్‌ లోని జంబోరీ మైదాన్‌ లో జరిగిన మహిళల సమావేశంలో మోకాళ్లపై కూర్చుని మరీ ‘‘నమస్కార్‌.. ప్రణామ్‌.. మీరే నాకు దుర్గ, లక్ష్మి, సరస్వతి’’ అంటూ వంగి వంగి దండాలు పెట్టారు ముఖ్యమంత్రి.

వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల్లోని మహిళలు లాడ్లీ బెహన్ యోజన పథకానికి అర్హులు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోటిమంది మహిళలకు నెలనెలా ఈ ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30లోగా దరఖాస్తులు సమర్పించాలని, జూన్‌ 10న బ్యాంకు ఖాతాల్లో తొలి విడత సొమ్ము జమవుతుందని వెల్లడించారు సీఎం. శాంపిల్ గా తానే ఓ మహిళకు సంబంధించిన దరఖాస్తు నింపి ఇచ్చారు. 12వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే బాలికలకు సైకిల్‌ బదులు ఇకపై స్కూటీ ఇస్తామని చెప్పారు.

ఓవైపు గ్యాస్ బాదుడు మొదలైంది, ఏప్రిల్-1 నుంచి టోల్ బాదుడు మొదలు కాబోతోంది. ఫలితంగా రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి. ఇలా ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం కేంద్రం మోపుతుంటే, ఎన్నికల వేళ ఇలాంటి కొత్త పథకాలతో రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఆయింట్ మెంట్ పూయాలని చూస్తున్నాయి.

First Published:  6 March 2023 12:01 AM GMT
Next Story