Telugu Global
National

చంద్రగ్రహణం : హైదరాబాద్ లో బహిరంగ భోజనాలు... ఒరిస్సాలో భజరంగ్ దళ్ దాడులు

చంద్రగ్రహణం గురించి ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దేశంలో అనేక చోట్ల హేతువాదులు వివిధ చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ఒరిస్సాలో హేతువాదులపై హిందుత్వ సంఘాలు దాడికి పాల్పడ్డాయి.

చంద్రగ్రహణం : హైదరాబాద్ లో బహిరంగ భోజనాలు... ఒరిస్సాలో భజరంగ్ దళ్ దాడులు
X

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఈ రోజు మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమిచ్చింది.

సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడం వల్ల భూని నీడ చంద్రుడిపై పడటంతోనే చంద్ర గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ చంద్రగ్రహణంపై ఇప్పటికీ మూఢనమ్మకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల్లో ఈ మూఢనమ్మకాలను మరింత వ్యాప్తి చేయ‌డానికి కొన్ని సంస్థలు పనిగట్టుకొని మరీ పనిచేస్తున్నాయి. చంద్రగ్రహణం ఉన్నప్పుడు బైటికి రావద్దని, ఏమీ తినొద్దని ప్రచారం చేస్తున్నారు సాంప్రదాయవాదులు. ముఖ్యంగా స్త్రీల విషయంలో మరింత ఎక్కువ మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు.

చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు డైరెక్ట్‌గా గ్రహణాన్ని చూడకూడదని, ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి బయటకు రాకూడదని, గ్రహణ సమయంలో ఏ ఆహారం తీసుకోకూడదని, మంచినీళ్లు తాగకూడదని, ఇంటి పనులు కూడా చేయకూడదని, ఈ సమయంలో కూరగాయాలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదని, గ్రహణం సమయంలో స్నానం చేయకూడదని, నిద్రపోకూడదని...ఇలా ఒకటి కాదు ఎటువంటి ఆధారాలు లేని, లాజిక్ లేని విషయాలను ప్రచారంలో పెడుతున్నారు సాంప్రదాయవాదులు. అయితే ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మొదటి నుంచీ హేతువాదులు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ చైతన్య కార్యక్రమాలు జరిగాయి.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉస్మానియా విద్యార్థులు, జనవిజ్ఞాన వేదికతో సహా దాదాపు 30కి పైగా సంఘాల అద్వర్యంలో బహిరంగ భోజన కార్యక్రమం నిర్వహించారు. చంద్రగ్రహణం సమయంలో బహిరంగ ప్రదేశంలో భోజనాలు చేసిన కార్యకర్తలు చంద్రునితో సెల్ఫీలు దిగారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుణ్ణి చూసినా బైట తిరిగినా, ఆ సమయంలో భోజనాలు చేసినా, ఏ పనులు చేసినా ఏ హానీ జరగదని కార్యకర్తలు, విద్యార్థులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరో వైపు ఓడిశాలో బహిరంగ భోజన కార్యక్రమం నిర్వహించిన హేతువాదులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు రాళ్ళదాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో, బెర్హంపూర్ నగరంలో హేతువాదులు నిర్వహించిన కార్యక్రమాలపై హిందుత్వ వాదులు దాడులకు పాల్పడ్డారు.

భువనేశ్వర్ లోని లోహియా అకాడమీలో హేతువాదులు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రగ్రహణం సమయంలో భోజనాలు చేశారు. విషయం తెలుసుకొని భజరంగ్ దళ్ తో సహా పలు హిందూ సంఘాల కార్యకర్తలు హేతువాదుల కార్యక్రమంపై రాళ్ళదాడికి పాల్పడ్డారు. దాంతో హేతువాదులు కూడా తిరగబడటంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన రాళ్లదాడిలో పలువురు హేతువాదులకు తీవ్ర‌ గాయాలయ్యాయని, లోహియా అకాడమీలో కిటికీ అద్దాలు, పూల కుండీలు కూడా దెబ్బతిన్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

''మేము చట్టబద్దంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దానిలో ఇష్టపూర్తిగా పాల్గొనేవారికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు హిందుత్వ సంఘాలకొచ్చిన ఇబ్బంది ఏంటి ?. మేము నమ్మినదానిపై మేము నిలబడతాము. శాస్త్రోక్తంగా లేనివాటిని ఆచరించకూడదని మేము నమ్ముతాము'' అని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు.

"మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించలేదు" అని వారు అన్నారు.

గతంలో అంధ విశ్వాసాలను బద్దలు కొట్టడానికి హేతువాదులు భువనేశ్వర్‌లో ఇటువంటి కార్యక్రమమే జరిగిపిన‌ప్పుడు కూడా కొన్ని హిందుత్వ గ్రూపులు దాడులు చేయడమే కాక హేతువాదులపైనే కేసులు నమోదు చేశారు.

"వారు అజ్ఞానులు. వారి చర్యలు సనాతన ధర్మం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. గ్రహణ సమయంలో ఆ వ్యక్తులు తినే ఆహారం (చికెన్ బిర్యానీ) వారి జీవితానికి శాపంగా మారవచ్చు, "అని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సర‌స్వతి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే హేతువాదులు, మేదావులు, విజ్ఞానులు, ప్రగతి శీలురు మాత్రం ఈ మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి మూఢనమ్మకాలను కాపాడుతూ, ప్రచారం చేస్తూ ప్రజలను అజ్ఞానంలో మగ్గేట్టు చేస్తున్న గ్రూపుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  8 Nov 2022 2:38 PM GMT
Next Story