Telugu Global
National

సినిమా పైర‌సీ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష‌.. - లోక్‌స‌భ‌లో బిల్లుకు ఆమోదం

ఈ బిల్లు ఆమోదం సంద‌ర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. పైరసీ అనేది క్యాన్సర్ లాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బిల్లు తెచ్చామని చెప్పారు.

సినిమా పైర‌సీ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష‌.. - లోక్‌స‌భ‌లో బిల్లుకు ఆమోదం
X

సినిమా పైర‌సీని అరిక‌ట్టేందుకు ప్ర‌వేశ‌పెట్టిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023ను సోమవారం లోక్‌స‌భ ఆమోదించింది. ఈ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఇదివ‌ర‌కే ఆమోదం ల‌భించింది. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర ల‌భించిన త‌ర్వాత ఇది చ‌ట్టంగా మారుతుంది. ఈ బిల్లులో ప్ర‌ధానంగా సినిమా పైర‌సీ చేసే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాల‌ని పేర్కొన్నారు. దాంతో పాటు సినిమా నిర్మాణానికి అయ్య ఖ‌ర్చులో 5 శాతం జ‌రిమానాగా విధిస్తారు.

ఈ బిల్లు ఆమోదం సంద‌ర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. పైరసీ అనేది క్యాన్సర్ లాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బిల్లు తెచ్చామని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కఠినమైన కొత్త సెక్షన్లను అందులో జోడించామని తెలిపారు. ప్రస్తుతం భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారని ఆయ‌న చెప్పారు.

ఇక‌పై వ‌య‌సుల వారీగా సెన్సార్ స‌ర్టిఫికెట్‌..

సినిమా, టీవీ కంటెంట్‌ను ఇక నుంచి వయసులవారీగా వర్గీకరిస్తున్నామని మంత్రి చెప్పారు. యూఏ కేటగిరీలో యూఏ 7ప్లస్, యూఏ 13ప్లస్, యూఏ 16ప్లస్ గా విభజిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వనున్నామని వివ‌రించారు. టీవీలో సినిమా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వనున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. పాత చట్టం ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ ప‌ది సంవ‌త్స‌రాల‌ వరకే చెల్లుబాటు అయ్యేదని, కొత్త బిల్లు చట్టంగా మారాక సెన్సార్ సర్టిఫికెట్ శాశ్వతంగా చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. `ఏ` సర్టిఫికెట్ పొందిన సినిమాలో మార్పులు చేస్తే యూఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం కొత్త బిల్లులో ఉందని తెలిపారు.

First Published:  1 Aug 2023 2:13 AM GMT
Next Story