Telugu Global
National

అత్యంత కాలుష్య భారతీయ నగరాల జాబితా విడుదల... ఫస్ట్ ప్లేస్ గోస్ టూ....

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 163 నగరాల్లో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరంగా బీహార్ లోని కతిహార్ నగరం నమోదయ్యింది. దీని తర్వాత స్థానం ఢిల్లీకి దక్కింది.

అత్యంత కాలుష్య భారతీయ నగరాల జాబితా విడుదల... ఫస్ట్ ప్లేస్ గోస్ టూ....
X

భారత దేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకూ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతూ ఉంది. వాయుకాలుష్యం వల్ల మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఒక్క 2017 లోనే వాయు కాలుష్యం వల్ల 12 లక్షల మంది మరణించారని ప్రభుత్వ డేటా చెప్తోంది. ఈ క్రమంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజాగా 2022 కు సంబంధించిన రిపోర్ట్ విడుదల చేసింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 163 నగరాల్లో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరంగా బీహార్ లోని కతిహార్ నగరం నమోదయ్యింది. ఇక్కడ‌ నవంబర్ 7వ తేదీన అత్యధికంగా 360 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) (వాయు నాణ్యత సూచిక)ని కలిగి ఉంది. దీని తర్వాత స్థానం ఢిల్లీకి దక్కింది. ఢిల్లీ AQI 354 గా నమోదయ్యింది ఆ తర్వాత వరసగా నోయిడా 328, ఘజియాబాద్ 304గా నమోదయ్యాయని డేటా చెపుతోంది. బెగుసరాయ్ (బీహార్), బల్లబ్‌గఢ్, ఫరీదాబాద్, హర్యానాలోని కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కూడా అత్యంత కాలుష్య నగరాల్లో ఉన్నాయి.

కనీస గాలి నాణ్యత ఎంత ఉండాలి అనే దానిపై నిపుణులు చెప్తున్న దాని ప్రకారం AQI 0-50 మధ్య ఉంటే'మంచిది', 51-100 మధ్య ఉంటే పర్వాలేదు, 101‍ 200 ప్రమాదానికి దగ్గరలో ఉన్నట్టు, 201-300 కొద్దిగా ప్రమాదకరం, 301-400 చాలా ప్రమాదకరం,401-500 మధ్య అత్యంత ప్రమాదకరం

ఈ వాయు కాలుష్యం పంట పొలాలను తగలబెట్టడం వల్ల, వాహనాల వల్ల, ఫ్యాక్టరీల వల్ల అధికంగా వస్తోందని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి.

గత బుధవారం పంజాబ్‌లో 3,634 పొలాల్లో కోతల తర్వాత రైతులు పొలాలను తగలబెట్టినట్టు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) నివేదించింది. ఇది ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికం. దీనివల్ల స్థానికంగానే కాకుండా గాలుల వల్ల ఆ పొగ కాలుష్యం ఢిల్లీని కూడా కమ్మేస్తుందని ప్రభుత్వం చెప్తోంది.

వాహనాల వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఢిల్లీలో వాహనాల వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రాజధాని సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్‌లను నివారించాలని, ఎక్స్‌ప్రెస్‌వేలపై అనవసరమైన వస్తువులను రవాణా చేసే ట్రక్కులను మళ్లించాలని కేంద్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఉత్తరప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.

మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ పరిధిలోని సఫర్ అనే ఏజెన్సీ ప్రకారం, ఢిల్లీలోని PM2.5 కాలుష్యం శుక్రవారం 30 శాతం ఉండగా శనివారం 21 శాతానికి పడిపోయింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQI PM 2.5 మైక్రాన్ల స్థాయిల సాంద్రత వరకు ఓకే కానీ 2.5 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే సూక్ష్మ కణాలు మనుషుల రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులు, గుండెలోకి చొచ్చుకుపోతాయి. ఇవి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.

ఈ విషపూరితమైన గాలి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారిలో అకాల మరణాలకు కూడా కారణమవుతుంది. గ్రీన్‌పీస్ సంస్థ రిపోర్ట్ ప్రకారం, వాయు కాలుష్యం కారణంగా 2017లో 12 లక్షలకు పైగా భారతీయులు అకాల మరణం చెందారు.

ప్రతి సంవత్సరం కాలుష్యానికి సంబంధించి రిపోర్టులు విడుదలవడం, మీడియా వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం, రెండురోజులు రాజకీయ నాయకులు గుండెలు బాదుకోవడం, ప్రజలు భయపడటం యదావిధిగా జరుగుతుంది. ఆ తర్వాత మామూలుగానే మర్చిపోతారు. కాలుష్యం పెరుగుతూనే ఉంటుంది. మరణాలు పెరుగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, ప్రజల నిర్లిప్తత సాగుతూనే ఉంటుంది.

First Published:  8 Nov 2022 7:44 AM GMT
Next Story