Telugu Global
National

లాకప్‌లో ఖైదీలతో కలసి మందు పార్టీ.. పోలీసుల అరెస్టు

పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. అది అలా ఇలా షేర్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది.

లాకప్‌లో ఖైదీలతో కలసి మందు పార్టీ.. పోలీసుల అరెస్టు
X

జైళ్లలో ఖైదీల నుంచి పోలీసులు లంచం తీసుకుని వారికి సకల వసతులు కల్పిస్తారనే అపవాదు ఉంది. తాజాగా ఓ కేసులో అరెస్ట్ అయి లాకప్‌లో ఉన్న నేరస్తులతో కలిసి పోలీసులు మందు పార్టీ చేసుకోగా..దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తులతో కలసి మందు పార్టీ చేసుకున్న పోలీసులు అధికారుల ఆగ్రహానికి గురై ప్రస్తుతం కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.

బీహార్‌లో ప్రస్తుతం మద్యనిషేధం అమల్లో ఉంది. దీంతో అక్కడ రహస్యంగా మద్యం, సారా విక్రయిస్తున్నారు. అలా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురిని గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మద్యాన్ని సీజ్ చేశారు. అనంతరం వారిని పాట్నాలోని పాలిగంజ్ పట్టణ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో పెట్టారు.

ఇదిలా ఉండగా గురువారం రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు సీజ్ చేసిన మద్యాన్ని ఓపెన్ చేశారు. స్టేషన్లోనే సిట్టింగ్ వేసి మద్యం సేవించారు. అంతటితో వారు ఆగలేదు. లాకప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఐదుగురు నేరస్తులకు మద్యం అందించారు. అందరూ కలిసి పొద్దుపోయేదాకా పార్టీ చేసుకున్నారు.

పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. అది అలా ఇలా షేర్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఈ వీడియో చూసిన అధికారులు నేరస్తులతో కలిసి మద్యం సేవించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు మిగిలిన ఐదుగురు నేరస్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో నేరస్తులతో కలిసి పోలీసులు మద్యం సేవిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First Published:  2 Dec 2022 11:03 AM GMT
Next Story