Telugu Global
National

క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్.. ధోనీ సెటైర్

రాయుడి గురించి ధోనీ సరదాగా ఆ మాట చెప్పినా.. దాని వెనుక చాలా అర్థం ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలంటే అన్నింటికంటే ముఖ్యంగా ఉండాల్సింది సహనమే.

క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్.. ధోనీ సెటైర్
X

భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియరైంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కి ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన ఈ గుంటూరు ప్లేయర్.. సోమవారం రాత్రి ఐపీఎల్‌ కెరీర్‌లోనూ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని తన హిట్టింగ్‌తో గెలుపు తీరాలకి చేర్చిన రాయుడు.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంతో ఘనంగా క్రికెట్‌ కెరీర్‌కి వీడ్కోలు పలికాడు. ఇక ఏపీ రాజకీయాల్లోకి ఈ మాజీ క్రికెటర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌‌లో ఆడుతూనే ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన అంబటి రాయుడు వైసీపీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకున్నాడు. అనంతరం ఐపీఎల్‌‌కి రిటైర్మెంట్ ప్రకటించేసి సోమవారం రాత్రి లాస్ట్ మ్యాచ్ కూడా ఆడేశాడు. ఇక పూర్తి స్థాయిలో పొలిటీషన్‌గా రాయుడు కొనసాగే అవకాశం ఉంది. రాబోవు ఎన్నికల్లో అంబటి రాయుడిని గుంటూరు లేదా విశాఖపట్నం ఎంపీగా పోటీచేయించే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం తన కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న గుంటూరుపైనే ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ టీడీపీ తరఫున ఎంపీగా గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు.

వ్యక్తిగతంగా అంబటి రాయుడిది చాలా దూకుడు స్వభావం. మైదానంలోనే కాదు వెలుపల కూడా గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వెలుపల వాకింగ్‌కి వచ్చిన ఓ వ్యక్తితో బాహాబాహీకి దిగాడు. అలానే గ్రౌండ్‌లో హర్భజన్ సింగ్‌తో పాటు కొంత మంది క్రికెటర్లతోనూ అతను నోరుజారి విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సోమవారం రాత్రి రాయుడి భవితవ్యం గురించి ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత మాట్లాడుతూ ‘‘అంబటి రాయుడు అన్ని విషయాలకీ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాడు.. కాబట్టి అతను టీమ్‌లో ఉండే ఫెయిర్‌ ప్లే అవార్డ్‌ని గెలవలేము’’ అని సెటైర్ వేశాడు. మైదానంలో క్రమశిక్షణ, సాటి క్రికెటర్లతో ఆటగాళ్లు వ్యవహరించే తీరుని బట్టి ఐపీఎల్‌లోని టీమ్స్‌కి ఫెయిర్ ప్లే అవార్డ్‌ని అందజేస్తారు.

రాయుడి గురించి ధోనీ సరదాగా ఆ మాట చెప్పినా.. దాని వెనుక చాలా అర్థం ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలంటే అన్నింటికంటే ముఖ్యంగా ఉండాల్సింది సహనమే. ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీసుకోవాలి.. అలానే వారిని విమర్శించే క్రమంలో హద్దులు దాటకూడదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవ‌ర్గ ప్రజల వద్దకి వెళ్తున్నారు. కానీ, చాలా మంది ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి తమని ప్రశ్నిస్తున్న వారిపై బెదిరింపులకి దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇన్నాళ్లూ ఆటలో సత్తాచాటిన అంబటి రాయుడు.. ఇకపై పొలిటికల్‌గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

First Published:  30 May 2023 7:31 AM GMT
Next Story