Telugu Global
National

యూపీలో ఆవుల బతుకే బాగుంది..

యూపీ పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పిన వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.7 లక్షల వీధి ఆవులను 6,889 షెల్టర్లలో ఉంచి రక్షిస్తున్నారు.

యూపీలో ఆవుల బతుకే బాగుంది..
X

యూపీలో రోడ్లపై తిరిగే ఆవులకే సమయానికి తిండి దొరుకుతోంది. ప్రభుత్వం ప్రజల కంటే ఆవుల సంరక్షణ మీదనే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇవి ఆషామాషీగా చెప్పే మాటలు కాదు.. ఇటీవల ప్రభుత్వమే విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పేదలు, 60 ఏళ్లు దాటిన వారికి యూపీ ప్రభుత్వం నెలకు రూ.1,000 పెన్షన్ చెల్లిస్తోంది. ఇందుకు 2022-23 బడ్జెట్‌లో రూ.6,069 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 54.9 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. ఇక 27.2 లక్షల మంది వితంతువులకు అందిస్తున్న రూ.1,000 పెన్షన్ కోసం రూ.3,299 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ఈ లెక్కలను సెప్టెంబర్ 9న యూపీ ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది.

అయితే ఇదే సమయంలో వీధిలో తిరిగే ఆవుల పోషణ, సంరక్షణకు భారీగా ఖర్చు చేస్తోంది. ఇటీవలే ఆవుల ఆహారం కోసం రోజుకు అందిస్తున్న రూ.30ని రూ.50కి పెంచింది. అంటే నెలకు ఒక్కో ఆవుపై రూ.1,500 మేర ఖర్చు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు పెన్షన్ కింద రూ.1,000 ఇస్తున్న యోగి ప్రభుత్వం.. ఆవుల పోషణకు మాత్రం పెద్ద పీట వేస్తోంది.

యూపీ పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పిన వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.7 లక్షల వీధి ఆవులను 6,889 షెల్టర్లలో ఉంచి రక్షిస్తున్నారు. ఇందులో 11.9 లక్షల పశువులు కౌ ప్రొటెక్షన్ షెల్టర్లలో ఉంటుండగా.. మిగిలిన 1,85,00 ఆవులను ముఖ్యమంత్రి సహభాగిత యోజన కింద సంరక్షిస్తున్నారు. ఈ ఆవులన్నింటి కోసం రోజుకు రూ.50 చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ.2,500 కోట్ల మేర యోగి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఆవులు సంతానోత్పత్తి వయసు దాటి పోయిన తర్వాత గతంలో కబేలాలకు తరలించే వారు. కానీ ఇప్పుడు యూపీలో గోవధపై నిషేధం విధించడంతో ఆవులు, ఎద్దులు, దున్నపోతుల వంటి వాటిని చాలా మంది రైతులు పోషించలేక వీధుల్లో వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వీధి ఆవుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని సార్లు ఇలా వదిలేసిన పశువులు పంట పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

గోసంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న పశువుల పోషణకు రోజుకు కనీసం రూ.62 ఖర్చు అవుతోంది. దీంతో ఆయా జిల్లా కలెక్టర్లు గోవుల ఆహారం కొరకు రూ.50 కంటే ఎక్కువ సొమ్మునే వివిధ మార్గాల ద్వారా అందిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఖాతాల నుంచి గోవుల పోషణకు నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో పాటు ఎన్జీవోలు, ఇతరుల నుంచి ఆహారం, నిధులు సేకరించి పశువులకు అందిస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న నిధులు ఆయా సంరక్షణ కేంద్రాల్లో ఉండే గోవుల సంరక్షణకు ఏ మాత్రం సరిపోవడం లేదు. పైగా ఆయా సంరక్షణ కేంద్రాల్లో పని చేసే కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం అదనపు భారంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 250 పెద్ద సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రంలో 5 వేల నుంచి 10 వేల ఆవులు ఇందులో ఉంచి సంరక్షిస్తున్నారు.

గోసంరక్షణ కేంద్రాల్లో పని చేసే కార్మికులకు రోజుకు రూ.210ని ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయా కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రాంతాన్ని బట్టి వారికి రూ.7 వేల నుంచి రూ.7,500 వరకు చెల్లించేందుకు నిర్ణయించినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే, ఈ నిధులు అన్నీ సక్రమంగా ఖర్చు అవుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.

గత ఐదేళ్లుగా వీధి ఆవుల సంరక్షణకు యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. అయినా సరే ఇప్పటికీ వీధి ఆవుల సమస్య ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకూ వీటి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఆవులు రోడ్లపై సంచరిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఒకవైపు ప్రజా సంక్షేమం కంటే ఆవుల సంరక్షణకు భారీగా నిధులు వెచ్చిస్తున్నా.. ఆవుల సమస్య మాత్రం ప్రభుత్వాన్ని వెన్నాడుతూనే ఉన్నది.

First Published:  14 Sep 2023 5:35 AM GMT
Next Story