Telugu Global
National

భారత్ లో ప్రతి నలుగురిలో ఒకరికి లే ఆఫ్ భయం..

Latest layoff news in India: మార్కెటింగ్ డేటా అండ్ అనలటిక్స్ సంస్థ - కాంటార్ చేపట్టిన సర్వేలో ఉద్యోగుల్లో లే ఆఫ్ భయం ఉన్నట్టు స్పష్టంగా తేలింది. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు లే ఆఫ్ భయంతో వణికిపోతున్నారు

Latest layoff news in india
X

భారత్ లో ప్రతి నలుగురిలో ఒకరికి లే ఆఫ్ భయం..

ఐటీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దిగ్గజ కంపెనీలు, స్టార్టప్ లు అనే తేడా లేకుండా ఉద్యోగాల్లో కోతలు పెట్టేస్తున్నాయి యాజమాన్యాలు. ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేకుండా అన్ని చోట్లా లే ఆఫ్ కామన్ గా మారిపోయింది. భారత్ ని కూడా లే ఆఫ్ భయాలు చుట్టుముట్టాయి.


ఈ దశలో అసలు ఐటీ ఉద్యోగులు ఎలా ఆలోచిస్తున్నారు. లే ఆఫ్ గురించి వారి అభిప్రాయమేంటి, ఉద్యోగం పోతే ప్రత్యామ్నాయం కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారా, కంపెనీపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారా.. అనే విషయాలపై కాంటార్ సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

మార్కెటింగ్ డేటా అండ్ అనలటిక్స్ సంస్థ - కాంటార్ చేపట్టిన సర్వేలో ఉద్యోగుల్లో లే ఆఫ్ భయం ఉన్నట్టు స్పష్టంగా తేలింది. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు లే ఆఫ్ భయంతో వణికిపోతున్నారు. ఫేక్ ఎక్స్ పీరియన్స్ కావొచ్చు, తమ పనితీరుపై సెల్ఫ్ అనాలసిస్ కావొచ్చు, లేదా కంపెనీ ఆర్థిక పరిస్థితి కావొచ్చు.. లే ఆఫ్ ప్రభావం తమపై కచ్చితంగా పడుతుందని నలుగురిలో ఒకరు మానసికంగా సిద్ధమయ్యారు.


ఆసక్తికర విషయం ఏంటంటే.. వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం. ఒకవేళ ఐటీ రంగాన్ని కూడా వదిలేయాల్సి వస్తే, అప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐటీ జంటలు కూడా సేఫ్ సైడ్ ఆలోచిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం పోతే.. ఒకే జీతంతో ఎలా సర్దుకు పోవాలోననే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రతి నలుగురిలో ఒకరు లే ఆఫ్‌ గురించి భయపడుతుంటే, మిగతా ముగ్గురు ధరల పెరుగుదల గురించి ఆందోళనలో ఉన్నారని కాంటార్ సర్వే స్పష్టం చేసింది. ఐటీలో ఉద్యోగాలు తీసేసే వేళ, ఎక్కడా జీతాలు పెంచరు. అంటే ఉన్న జీతంతోనే సర్దుకోవాలి, పెరుగుతున్న ధరలను ఎదుర్కోవాలి.


2023లో భారత్ లో ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతుందని 50శాతం మంది విశ్వసిస్తున్నారు. 31శాతం మాత్రం వృద్ధి నెమ్మదిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక మందగమనం, కొవిడ్‌ ముప్పు మళ్లీ తప్పదేమోననే అంచనాలపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌ కతా, చెన్నై, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో 2022 డిసెంబరు 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకు కాంటార్‌ సంస్థ ఈ సర్వే చేపట్టింది. 21-55 మధ్య వయసు వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది.

First Published:  26 Jan 2023 1:52 AM GMT
Next Story