Telugu Global
National

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కాల‌ను నియంత్రించేలా కొత్త చ‌ట్టం..!

ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ఈ బిల్లులో ప్రతిపాదించిన‌ట్టు తెలిసింది.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కాల‌ను నియంత్రించేలా కొత్త చ‌ట్టం..!
X

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టంతో నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలు, స‌ర్వీసుల కండీష‌న్లు (పదవీకాలం) బిల్లు, 2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం లిస్ట్ చేసింది. నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ఈ బిల్లులో ప్రతిపాదించిన‌ట్టు తెలిసింది. అయితే, ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌స‌భలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉండనున్నట్టు సమాచారం. ఈ ప్యానెల్‌కి ప్ర‌ధాన మంత్రి నేతృత్వం వ‌హిస్తార‌ని బిల్లులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘంలో నియామకాలను.. ప్రధాని, లోక్‌స‌భలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల క‌మిష‌న‌ర్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ల‌ను రాష్ట్ర‌ప‌తి మాత్ర‌మే నియ‌మించాల‌ని ఆ తీర్పులో అత్యున్న‌త ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈసీల నియామ‌కాల కోసం కొత్త చ‌ట్టం తెచ్చేవ‌ర‌కు ఈ త్రిస‌భ్య క‌మిటీ అమ‌లులో ఉంటుంద‌ని సుప్రీంకోర్టు అప్ప‌ట్లో తెలిపింది. తాజాగా ఈ నియామ‌కాల కోసం కేంద్రం బిల్లును రూపొందించింది. అయితే అందులో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ని తొల‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

First Published:  10 Aug 2023 10:11 AM GMT
Next Story