Telugu Global
National

కశ్మీర్‌లోని చౌదరిగుండ్‌ను వీడిన ఆఖరి కశ్మీరీ పండిట్

షోపియాన్ జిల్లా చౌదరి గుండ్ గ్రామంలో నివసిస్తున్న చిట్టచివరి కశ్మీరీ పండిట్ ఆ గ్రామాన్ని వీడి జమ్మూకు వెళ్లిపోయింది. చౌదరిగుండ్ గ్రామంలో ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన పురాన్ కృషన్ భట్‌ను ఉగ్రవాదులు అతడి ఇంటి బయటే చంపేశారు. దీంతో గ్రామంలోని కశ్మీర్ పండిట్లు ఊరు వదిలి వెళ్లిపోయారు.

కశ్మీర్‌లోని చౌదరిగుండ్‌ను వీడిన ఆఖరి కశ్మీరీ పండిట్
X

జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామంలో నివసిస్తున్న చిట్ట చివరి కశ్మీరీ పండిట్ ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వలస వెళ్ళిపోయింది. గత కొన్ని నెలలుగా ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోని కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు నెలల్లో ముగ్గురు కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు చంపేశారు. షోపియాన్ జిల్లాలోనే వరుసగా ఇద్దరు కశ్మీర్ పండిట్లను హత్య చేశారు. దీంతో కశ్మీర్లో కశ్మీర్ పండిట్లు ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతూ వస్తున్నారు.

కశ్మీర్లో భద్రతా బలగాలను మోహరించామని..ఇకపై కశ్మీరీ పండిట్లు, స్థానికేతరులు, హిందువులపై ఎటువంటి దాడులు జరగబోవని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నా ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగడం లేదు. తాము కశ్మీర్లో బతికేందుకు తగిన రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా షోపియాన్ జిల్లా చౌదరి గుండ్ గ్రామంలో నివసిస్తున్న చిట్టచివరి కశ్మీరీ పండిట్ ఆ గ్రామాన్ని వీడి జమ్మూకు వెళ్లిపోయింది. చౌదరిగుండ్ గ్రామంలో ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన పురాన్ కృషన్ భట్‌ను ఉగ్రవాదులు అతడి ఇంటి బయటే చంపేశారు. దీంతో ఉగ్రవాదుల దాడులకు భయపడి గ్రామంలోని కశ్మీర్ పండిట్లు ఊరు వదిలి వెళ్లిపోయారు.

గురువారం సాయంత్రం ఈ గ్రామానికి చెందిన ఆఖరి కశ్మీర్ పండిట్ అయిన డోలీ కుమారి గ్రామాన్ని విడిచిపెట్టి జమ్మూకు వలస వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కశ్మీర్ లోయలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని, ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోవడం తప్ప ఏం చేయగలనని వాపోయారు.

తమ గ్రామంతో పాటు జిల్లాలో వరుసగా కశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడి జరుపుతుండడంతో గ్రామంలో ఉన్న కశ్మీర్ పండిట్ల కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయని చెప్పారు. తాను మాత్రం ఎంతో ధైర్యంతో కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉన్నానని, ఇప్పుడు పరిస్థితి మరింత భయానకంగా తయారు కావడంతో ఊరు విడిచి వెళ్తున్నట్లు తెలిపారు. తనకు గ్రామంలో సొంతిల్లు ఉందని, ఇంటిని వదలి వెళ్లిపోవాలని లేదని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లక తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి కొంత మెరుగైతే తిరిగి స్వగ్రామానికి వస్తానని డోలీ తెలిపారు.

First Published:  28 Oct 2022 12:21 PM GMT
Next Story