Telugu Global
National

కోటా ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణం..!

కోటా మరణాలకు ప్రేమ, అక్రమ సంబంధాలు కారణం అంటున్న మంత్రి వ్యాఖ్యల్ని తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. చనిపోయిన తమ కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు బాలిక తండ్రి రవీంద్ర సిన్హా.

కోటా ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణం..!
X

రాజస్థాన్ లోని కోటాలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు వస్తున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్యలకు కారణం వారి ప్రేమ వ్యవహారాలేనంటూ బాధ్యతారాహిత్యమైన స్టేట్ మెంట్ ఇచ్చారు ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్. ప్రేమతోపాటు, తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. కోటా ఆత్మహత్యలతో ప్రభుత్వంపై ఇరుకున పడుతున్న సమయంలో మంత్రి ధరివాల్ స్టేట్ మెంట్ కాంగ్రెస్ ని మరింత ఇరుకునపెట్టింది.

ఇటీవల హాస్టల్ లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె మరణానికి ప్రేమ వ్యవహారమే కారణం అని, అక్కడ సూసైడ్ నోట్ కూడా లభించిందని మంత్రి ధరివాల్ తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఆమె చనిపోయిన రూమ్ లో ఎలాంటి సూసైడ్ నోట్ కానీ, లెటర్ కానీ లభించలేదని చెప్పారు. పోలీసులు కాదని చెబుతున్నా మంత్రి మాత్రం ప్రేమే కారణం అంటున్నారు. కావాలంటే మృతురాలి తండ్రిని ప్రశ్నించాలంటూ మీడియా ముందు దబాయించారు. అక్రమ సంబంధం కారణంగా అమ్మాయిలు చనిపోయారని చెబితే చాలామంది బాధపడతారని, కానీ చెప్పక తప్పడంలేదని, కోటా ఆత్మహత్యల వెనక అసలు కారణాలు అవేనని మంత్రి ధరివాల్ ఆరోపిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..

కోటా మరణాలకు ప్రేమ, అక్రమ సంబంధాలు కారణం అంటున్న మంత్రి వ్యాఖ్యల్ని తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. చనిపోయిన తమ కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు బాలిక తండ్రి రవీంద్ర సిన్హా. మంత్రి దగ్గర ఆధారాలుంటే చూపించాలన్నారు. కోచింగ్‌ సెంటర్ వద్ద కొందరు అబ్బాయిలు ఇబ్బంది పెట్టేవారని కుమార్తె తనకు ఫిర్యాదు చేసిందన్నారాయన. కానీ అప్పటికే ఆలస్యం అయిందని, ఆమె ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు.

23మంది ఆత్మహత్యలు..

రాజస్థాన్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి కూడా కోటాకు వచ్చి నీట్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటుంటారు విద్యార్థులు. అక్కడే వారు హాస్టల్స్ లో ఉంటారు. అయితే ఒత్తిడి ఇతరత్రా కారణాలతో ఇక్కడ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. కోటాలో గతేడాది 15మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా రాజస్థాన్ మంత్రి ధరివాల్ వ్యాఖ్యలు మరింత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

First Published:  15 Sep 2023 4:13 AM GMT
Next Story